జోరుగా కార్ల అమ్మకాలు..
గత ఆర్థిక సంవత్సరంలో 8% అప్: సియామ్ వెల్లడి
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో బాగా జోరందుకున్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక విక్రయాలు చోటు చేసుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) తెలిపింది. కొత్త మోడళ్లు అధికంగా రావడం, అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం దీనికి కారణమని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు.
2014-15లో 18,77,706గా ఉన్న కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 8% వృద్ధితో 20,25,479కు పెరిగాయని పేర్కొన్నారు. కార్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి 2010-11 ఏడాదిలో చోటు చేసుకుందని, ఆ ఏడాది కార్ల విక్రయాలు 29 శాతం వృద్ధి సాధించాయని వివరించారు.