
మార్కెట్లోకి సెల్‌కాన్ ఎపిక్ క్యూ550
మొబైల్ ఫోన్ల సంస్థ సెల్‌కాన్.. మిలీనియా సిరీస్‌లో ఎపిక్ క్యూ550 మోడల్‌ను ఆవిష్కరించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల సంస్థ సెల్‌కాన్.. మిలీనియా సిరీస్‌లో ఎపిక్ క్యూ550 మోడల్‌ను ఆవిష్కరించింది. 8 మిల్లీమీటర్ల మందం, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణ. 24 రోజుల స్టాండ్ బై ఉంటుందని కంపెనీ తెలిపింది. 5.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ వన్ గ్లాస్ సొల్యూషన్ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, క్వాడ్‌కోర్ 1.3 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటివి అదనపు హంగులు.
ఆటోఫోకస్, ఫ్లాష్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ముందు కెమెరా ఉన్నాయి. 64 జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. పెన్‌డ్రైవ్, మౌస్, కీ బోర్డును ఫోన్‌కు అనుసంధానించొచ్చు. ధర రూ.10,499. బరువు 143 గ్రాములు. బ్యాటరీని బయటకు తీయడానికి వీలులేని యూనిబాడీ డిజైన్‌తో ఫోన్‌ను రూపొందించినట్టు కంపెనీ ఈడీ మురళి రేతినేని ఢిల్లీలో విలేకరులకు తెలిపారు.
భారత్‌లో తొలిసారిగా..
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల తొలి ప్రాధాన్యత బ్యాటరీ బ్యాకప్ అని సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక బ్యాటరీ బ్యాకప్‌తోపాటు తక్కువ మందంతో తేలికైన ఎపిక్ క్యూ550 మోడల్‌కు రూపకల్పన చేశామని చెప్పారు. ఇంత తక్కువ ధరలో, ఈ ఫీచర్లతో కూడిన మొబైల్ మార్కెట్లోకి రావడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రిటైలర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని గుర్తు చేశారు. 5.5 అంగుళాల స్క్రీన్ ఉన్న మోడళ్లకు గిరాకీ పెరుగుతోందన్నారు.
యువతను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో ఫోన్ డిజైన్ చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఔట్‌లెట్లతోపాటు స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్లలో ఫోన్ లభిస్తుందని తెలిపారు. శ్రీలంక, నేపాల్, సింగపూర్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు వెల్లడించారు.