
వాహనానికీ ఆన్‌లైన్ బీమా ఉంది!
మీరో వాహనం కొన్నారు. బీమా తప్పనిసరి కదా!! మరేం చేస్తారు? అంతా షోరూమ్‌లోని ఏజెంట్లనే ఆశ్రయిస్తారు.
ఆఫ్‌లైన్‌తో పోలిస్తే చౌకగానే పాలసీలు
ప్రీమియంలు తక్కువ
మీరో వాహనం కొన్నారు. బీమా తప్పనిసరి కదా!! మరేం చేస్తారు? అంతా షోరూమ్‌లోని ఏజెంట్లనే ఆశ్రయిస్తారు. కొందరైతే సదరు షోరూమ్ డీలర్‌నో, తమకు రుణమిచ్చిన బ్యాంకర్‌నో సంప్రతిస్తారు. బీమా తీసుకుంటారు కూడా. కానీ చౌకగా కావాలంటేనో...!! ఇదిగో ఇక్కడే ఆన్‌లైన్ మార్గం కనిపిస్తుంది మనకు. ఇంటర్నెట్ చార్జీలు తగ్గుతూ స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడం ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఊతమిస్తోంది. ఇపుడీ రూట్లో బీమా పాలసీలు తీసుకునేవారూ పెరుగుతున్నారు. దానిపై అవగాహన కల్పించటమే ఈ కథనం ఉద్దేశం.
నిత్యం రోడ్డు ప్రమాదాలతో మన రహదారులు బోలెడంత అపప్రద మూటగట్టుకున్నాయి. దీంతో, ఇటీవలే మోటార్ వెహికల్ బిల్లుకు కొత్త సవరణలు చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడం వంటివి ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ.. చాలామంది వాహనదారులు.. పాలసీ తీసుకోవడమంటే సంక్లిష్టమైన ప్రక్రియగా భావించి బీమా లేకుండానే వాహనాలు నడిపించేస్తుంటారు. నిజానికపుడు సింపుల్‌గా ఫారం నింపి, ప్రీమియం లెక్కించుకుని, ఆన్‌లైన్‌లో కట్టేస్తే చాలు. అంతే..!! ఎలాంటి పేపర్ వర్కూ లేకుండా అప్పటికప్పుడు బీమా కవరేజీ లభిస్తోంది. ఆఫ్‌లైన్ పాలసీలతో పోలిస్తే ఆన్‌లైన్ పాలసీల ప్రీమియం కొంత తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీరు నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయడం వల్ల ఏజెంట్లు, ఇతరత్రా అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల వంటివి తగ్గుతాయి.
పోల్చి చూసుకోవచ్చు..
ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ విధానంలో ప్రీమియంలను, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తులను, కాల వ్యవధులను, ఇతరత్రా అదనపు ఫీచర్లను పోల్చిచూసుకోవచ్చు. వాహన బీమా విషయంలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ (ఐడీవీ) చాలా కీలకమైనది. ఆన్‌లైన్ బీమాతో వివిధ సంస్థలు మీ వాహనానికి లెక్కకడుతున్న ఐడీవీని పోల్చి చూసుకుని, మెరుగైన పాలసీని ఎంచుకోవచ్చు. ఏజంట్లు ఏవో మాయమాటలు చెప్పి తమకు ఎంతమాత్రం ఉపయోగపడని పాలసీలను అంటగట్టారంటూ చాలా మంది పాలసీదారుల నుంచి సాధారణంగా ఆరోపణలు వస్తుంటాయి. అదే ఆన్‌లైన్‌లో అయితే అన్ని వివరాలు మీ ముందే ఉంటాయి కాబట్టి మీకు అనువైన పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఎంపిక చేసుకోవచ్చు.
సులభతరంగా రెన్యువల్..
పోర్టల్‌లో లాగిన్ కావడం, అవసరమైన పాలసీని ఎంచుకోవడం (ఇప్పటికే ఉన్నదైనా లేదా వేరే బీమా సంస్థ నుంచి బదలాయించేదైనా), వివరాలు.. ఫోన్ నంబర్ మొదలైనవి ఫారంలో నింపడం చేస్తే చాలు. రెన్యువల్ నోటీసు పేజీ వస్తుంది. అందులో పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేసి చెల్లింపులు చేస్తే చాలు.. కవరేజీ అప్పటికప్పుడు రెన్యువల్ అయిపోతుంది. ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు బీమా కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గణనీయంగా ఉపయోగించుకుంటున్నాయి. పెట్రోల్ బంకులతోనూ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో వాహనంలో ఇంధనం నింపుకోవడానికి వచ్చిన వారు అక్కడికక్కడే మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునే వెసులుబాటు లభిస్తోంది. మొబైల్ ప్రింటర్లతో కస్టమర్లకు అప్పటికప్పుడే పాలసీ కాపీ కూడా లభిస్తోంది. ఆన్‌లైన్ పాలసీ తీసుకునేటప్పుడు తగిన సలహాలు, సూచనల కోసం ఆన్‌లైన్ చాటింగ్ సహాయం తీసుకోవచ్చు. షరా మామూలుగా ఆన్‌లైన్‌లో అయినా సరే ముందుగా తగినంత అధ్యయనం చేసిన తర్వాతే మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోండి.