నదుల అనుసంధానానికి సంబంధించి స్వల్పకాలంలోనే మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) వెల్లడించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నదుల అనుసంధానానికి సంబంధించి స్వల్పకాలంలోనే మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) వెల్లడించింది. 2014లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని నర్మదా – క్షిపర – సింహస్థ (ఎన్‌కేఎస్) ప్రాజెక్టును పూర్తి చేశామని, తర్వాత పట్టిసీమ ప్రాజెక్టును, తాజాగా గోదావరి–ఏలేరు నదుల అనుసంధానంతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును పూర్తి చేశామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సుమారు రూ. 1,638 కోట్ల విలువైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది జనవరి 5న శంకుస్థాపన జరగ్గా.. ఆరు నెలల్లోనే అడ్డంకులను అధిగమించి ప్రధానమైన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ విధంగా మూడేళ్ల వ్యవధిలోనే మూడు ప్రాజెక్టులు విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని ఎంఈఐఎల్ వివరించింది. ఆగస్టు 15న పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ఎంఈఐఎల్ చైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య, సీజీఎం రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.