
ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ రంగంలోకి దిగింది. పలు మెట్రో నగరాల్లో వారికి ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సంస్థ ( నేషనల్ హెల్త్ అథారిటీ) తో ఒక భాగస్వామ్యానికి వచ్చినట్టు వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరునకు నాయకత్వం వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు భారీ ఊరట కల్పించింది. ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలకు సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉబెర్ తెలిపింది. కరోనా పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు.
ఇటీవలే ప్రారంభించిన ఉబెర్ మెడిక్ సేవ ద్వారా ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్, పట్నా నగరాల్లో వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందివ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన150 కార్లను అందుబాటులో వుంచింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తామని తెలిపింది. ప్రతీ రైడ్ తరువాత శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది. డ్రైవర్లు భద్రతా విధానాలలో ప్రత్యేకంగా శిక్షణతోపాటు మాస్క్ లు శానిటైజర్లు సహా ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలను అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అపూర్వ సేవలందిస్తున్న వైద్య సిబ్బదికి ఉబెర్ ఇండియా సౌత్ అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment