సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ సోకి తగ్గిన అనంతరం పలువురికి శారీరక సమస్యలే కాకుండా రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. మానసికంగా బాధపడుతున్న వారికి యునిసెఫ్, ఎయిమ్స్ (మంగళగిరి) సంస్థలు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాయి. అన్ని రకాల మానసిక సమస్యలకు సేవలు అందించడానికి హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ విధుల్లో వీరు ఆందోళనతో ఉంటున్నారు.
తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు. ఇలాంటి వారి మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, మందులు ఇవ్వడానికి ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. మానసిక సమస్యల్లో ఎక్కువగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇకపై ఏమీ చేయలేమేమో అన్న ఆలోచనలో ఉంటున్నారు. నిద్ర లేమి, కుటుంబ సభ్యులు కరోనా బారిన పడతారేమోనన్న ఆందోళన వారిని వేధిస్తోంది.
ఈ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు
ఎయిమ్స్‌లో 9494774372, 9494774082 నంబర్లకు ఫోన్ చేస్తే చాలు.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు అక్కడి వైద్యులు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా మందులనూ సూచిస్తారు. హెల్త్‌కేర్ వర్కర్లు వివరాలు ఇవ్వాలని ఎయిమ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని యునిసెఫ్ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. హెల్త్‌కేర్ వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఉపయోగకరమన్నారు. ప్రస్తుతానికి మంగళగిరి ఎయిమ్స్‌లో మాత్రమే కేంద్రం ఉందని, భవిష్యత్‌లో మరిన్ని చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటి వరకూ 2 వేల మంది హెల్త్‌కేర్ వర్కర్లకు స్క్రీనింగ్ చేశామని, మరో 400 మందికి చికిత్స చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment