హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్‌కు ఎస్‌బీఐ బ్యాంక్‌లో వాహన రుణం ఉంది. ప్రతి నెల లాగే రూ.6,150 ఈఎంఐ వాయిదా గడువు ఏప్రిల్ 6. కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలో సరిపడా నగదు నిల్వ ఉంచుకోవాలని సందేశం వచ్చింది’’ కిషోర్‌కు హెచ్‌డీఎఫ్‌సీలో పర్సనల్ లోన్ ఉంది. తనక్కూడా ఖాతాలో తగిన నిల్వ ఉంచుకోవాలని మెసేజ్ వచ్చింది. అయినా అదేంటి? ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం ప్రకటించిందిగా.. మళ్లీ ఈ మెసేజ్ ఏంటని శ్రీనివాస్, కిషోర్ సందేహం. నిజానికిది వీళ్లిద్దరి సందేహమే కాదు. క్రెడిట్ కార్డ్స్‌తో సహా పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హౌసింగ్ లోన్... ఇలా అన్ని రకాల రుణ ఖాతాదారులదీనూ!!.
కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల మీద మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మన దేశంలో చాలా వరకు ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంటాయి. ఈఎంఐను దృష్టిలో పెట్టుకొని ఖాతాలో నగదు నిల్వ ఉంచుకుంటారు. అయితే ఆర్‌బీఐ మారటోరియం నేపథ్యంలో సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలల మారిటోరియంను లాక్ చేశామని, దీంతో ఆటోమేటిక్‌గా ఈఎంఐ నిలిచిపోతుందని ఎస్‌బీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు. ఒకవేళ ఈఎంఐ కట్ అయితే గనక ఆందోళన చెందవద్దని.. సంబంధిత మొబైల్ సందేశాన్ని బ్యాంక్ శాఖకు మెయిల్ ద్వారా తెలియజేస్తే.. తిరిగి ఖాతాలో సొమ్ము జమ అవుతుందని వెల్లడించారు.
ఈఎంఐ వాయిదా వద్దా?
ఒకవేళ ఎవరైనా రుణ ఖాతాదారులు మూడు నెలల మారటోరియాన్ని వద్దనుకుంటే మాత్రం ఖాతాదారులే స్వయంగా లేదా మెయిల్ ద్వారా సంబంధిత బ్యాంక్ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచైతే ఈఎంఐ కట్ అవుతుందో ఆ బ్యాంక్ శాఖకు సమాచారం అందించాలి. ఉదాహరణకు బ్యాంక్ అకౌంట్ ఎస్‌బీఐలో ఉండి, వాహన రుణం హెచ్‌డీఎఫ్‌సీలో ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈఎంఐ కట్ అవుతుంది ఎస్‌బీఐలోనే కనక.. రుణ వాయిదాను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని సంబంధిత ఎస్‌బీఐ శాఖకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ఎవరైనా కస్టమర్లు మూడు నెలల పాటు కాకుండా ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే మారటోరియం కావాలన్నా కూడా ఎంపిక చేసుకునే వీలుంటుందని బ్యాంక్ అధికారులు తెలియజేశారు.
ఈసీఎస్ పరిస్థితేంటి?
ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ (ఈసీఎస్), డిమాండ్ డ్రాఫ్ట్, (డీడీ), ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) వంటి ద్వారా ఈఎంఐ ఉపసంహరణ ఉన్న ఖాతాదారులు మారటోరియం ఆప్షన్‌ను ఎంచుకోవాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా గానీ మెయిల్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా గానీ సంబంధిత బ్యాంక్ శాఖను సంప్రదించాలి. అంతే తప్ప భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల బ్యాంకే స్వయంగా ఈసీఎస్‌ను నిలుపుచేసే నిర్ణయాన్ని తీసుకోబోదని ఎస్‌బీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. క్రెడిట్ కార్డ్ బాకీలు, ఈఎంఐలకు కూడా ఈ మారటోరియం వర్తిస్తుంది. మూడు నెలల తర్వాత కట్టవచ్చు. కాకపోతే ఈ మూడు నెలల సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది.
ఎలాంటి రుణాలకు మారటోరియం?
క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో సహా కార్పొరేట్, ఎంఎస్‌ఎంఈ, రిటైల్, వ్యవసాయ, వాహన, విద్య, గృహ, వ్యక్తిగత అన్ని రకాల రుణాలకు ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ రెండింటికీ కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుంది. ఈ మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిలుగా పరిగణించరు. మారటోరియం వినియోగించిన కస్టమర్ల సిబిల్ స్కోర్ మీద ఎలాంటి ప్రభావం లేకుండా బ్యాంక్‌లు సంబంధిత వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీ) అందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
ఏయే బ్యాంక్‌లంటే..
అన్ని కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ, స్మాల్ ఫైనాన్స్, లోకల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులకు ఈ మారటోరియం వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment