న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న యాంటి వైరల్ ఔషదం ఫవిపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ శనివారం ప్రకటించింది. తమ ఔషదానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం మార్కెటింగ్ అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఫబిఫ్లూ పేరిట ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్టు వెల్లడించింది. కోవిడ్ బాధితుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వైరస్ తీవ్రత ఉన్నవారికి ఫబిప్లూతో చికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పింది.
దేశీయంగా కరోనా రోగులకు చికిత్స అందించే మందుల్లో ఫబిఫ్లూ తొలి ఔషదమని కంపెనీ పేర్కొంది. ఇక భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ అప్రూవల్ రావడం శుభపరిణామమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా చెప్పారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఫబిఫ్లూతో ఉపశమనం లభించనుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం, మెడికల్ కమ్యునిటీతో కలిసి బాధితులకు సేవలందిస్తామన్నారు.
(చదవండి: స్మార్ట్‌ఫోన్‌తో కరోనాను గుర్తించవచ్చు!)
ఒక్కో టాబ్లెట్ ధర 103 రూపాయలుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 1800 ఎంజీ మాత్రలు రోజు ఒకటి చొప్పున, 800 ఎంజీ మాత్రలు రోజూ రెండు చొప్పున 14 రోజుల వరకు వైద్యుల సలహామేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. కాగా, జపాన్‌లో ఇన్‌ఫ్లుయంజా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం తొలుత ఈ ఔషధాన్ని కనుగొన్నారు. కొవిడ్-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఫవిపిరవిర్ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇదిలాఉండగా.. శనివారం దేశవ్యాప్తంగా మరో 14,516 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. తాజాగా 375 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 12,948 కి చేరాయి.
(చదవండి: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!)
Comments
Please login to add a commentAdd a comment