సాక్షి, ముంబై : దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) మరోసారి వార్తల్లో నిలిచింది. వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణంతోపాటు, కరోనా వైరస్, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా సంక్షోభంలో పడిన బ్యాంకు టాప్ మేనేజ్ మెంట్ కోసం అత్యంత విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడం సంచలనం రేపుతోంది. ఆర్థిక నష్టాలను పట్టించుకోకుండా గత నెలలో సుమారు రూ .1.34 కోట్ల విలువైన హై-ఎండ్ లగ్జరీ కార్లను అందించడం విమర్శలకు తావిచ్చింది.
అయితే బోర్డు ఆమోదం పొందిన తరువాత, ఫుల్ టైం డైరెక్టర్లకు మంజూరు చేసిన పరిమితిలోనే వీటిని కొనుగోలు చేసినట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించాయి. అలాగే గత సంవత్సరం ఉపయోగించకుండా మిగిలిన నిధులతో కలిపి వీటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించాయి. పీఎన్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్లను ఉపయోగిస్తారని తెలిపాయి. (లాక్‌డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు)
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, క్యాబినెట్ మంత్రులు కూడా జర్మన్ లగ్జరీ కారు ఆడి కంటే చాలా తక్కువ ఖరీదైన మారుతి సుజుకి సియాజ్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శికి సమానం. అటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (ఎండీ కంటే ఎక్కువ స్థాయి ర్యాంకు) కూడా టయోటా కరోలా ఆల్టిస్‌ను ఉపయోగిస్తున్నారని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ అతని మామ మెహుల్ చోక్సీకు మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ) జారీ చేయడం ద్వారా రూ .14 వేల కోట్ల కుంభకోణం 2018లో వెలుగు చూసింది. 2020 జనవరితో ముగిసిన మూడవ త్రైమాసికంలో, బ్యాడ్ లోన్లు గణనీయంగా పెరగడంతో బ్యాంక్ రూ. 502 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఏడాది క్రితం ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ .249.75 కోట్లు. (పెట్రో షాక్ : నాలుగో రోజూ)
కాగా కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం అన్నిమంత్రిత్వ శాఖలను కోరింది. ఈ క్లిష్ట సమయాల్లో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment