
పెద్ద నోట్ల రద్దుతో రుణ వృద్ధికి బాట
• సీఐఐ విశ్లేషణ
• డిజిటల్ డేటాబేస్ వ్యవస్థతో ఎన్‌పీఏలను కట్టడి చేయవచ్చని సూచన
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు బ్యాంకింగ్ రుణ వృద్ధికి దోహదపడుతుందని ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధి సంస్థ– సీఐఐ విశ్లేషించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. డీమోనిటైజేషన్ వల్ల అనధికార పొదుపులు అధికారికంగా మారి వృద్ధికి దోహదపడతాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి సీఐఐ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ బ్యాంకులు తమకు పెద్ద మొత్తంలో అందుబాటులోకి వచ్చిన నిధులను ఉత్పాదక రంగాలవైపు తరలించే వీలుంది. ఇది బ్యాంకింగ్ రుణ వృద్ధికి దోహదపడే అంశం.
⇔ ఇక వ్యక్తులు, కార్పొరేట్ల రుణ చరిత్ర ఆధారంగా బ్యాంకింగ్ విభిన్న రుణ రేట్లను అవలంబించే వీలుంది. ఇది దీర్ఘకాలంలో మొండిబకాయిల సమస్య తగ్గడానికి దోహదపడుతుంది. ఇక చక్కటి రుణ చెల్లింపు చరిత్ర ఉన్న కస్టమర్లు తేలిగ్గా బ్యాకింగ్ రుణాలు పొందే అవకాశం ఉంది.
⇔ మొండిబకాయిల భారాన్ని తగ్గించుకునే క్రమంలో బ్యాంకర్లకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఇంటర్–లింక్డ్ డిజిటల్ డేటాబేస్ వ్యవస్థను సృష్టించుకుంటే ఫలితాలు మరింత బాగుంటాయి. దీనివల్ల చిన్న, మధ్య, బడా కార్పొరేట్ల రుణ గణాంకాలు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు అందుబాటులో ఉంటాయి. రుణ గ్రహీత ‘రుణ చెల్లింపు సామరాథ్యన్ని’ ఇంటర్–లింక్డ్ డిజిటల్ డేటాబేస్ వ్యవస్థ ఫైనాన్షియర్‌కు అందుబాటులో ఉంచుతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను శాఖ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి కీలక మార్గాల ద్వారా డిజిటల్ డేటాబేస్ వ్యవస్థను రూపొందించుకునే వీలుంటుంది.