దేశం ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి తాము చాలా కష్టపడి పనిచేశామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు.
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి తాము చాలా కష్టపడి పనిచేశామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, దీనికి డీమానిటైజేషన్ ముఖ్యమైన ఉదాహరణ అని అన్నారు. దీంతో గత మూడు సంవత్సరాల్లో ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. ఫిక్కీ సదస్సులో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
గత 30 ఏళ్ళలో మొదటిసారిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ, ఈ మార్పులో భారత ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించారని అమిత్ షా వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాల లాభాలపై దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చారు. ముద్రా బ్యాంకు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారని అమిత్ షా తెలిపారు. అలాగే 30 కోట్ల కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు చెప్పారు. ఈ కారణంగా తమకు రాజకీయ నష్టం జరిగినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే నిర్ణయాలపైనే మొగ్గు చూపిందని చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అవసరం ఉందని షా చెప్పారు.