మొండి బకాయిలకు... మూల కారణం గుర్తించాలి
సుప్రీంకోర్టు వ్యాఖ్య... కేవలం పేర్లు వెల్లడిస్తే సమస్య
పరిష్కారం కాబోదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌కు రూ.500 కోట్లు ఆపైన బకాయిదారుల పేర్లు వెల్లడించినంత మాత్రాన మొండిబకాయిల సమస్య (ఎన్‌పీఏ) పరిష్కారం అయిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. తీవ్రమైన ఎన్‌పీఏ సమస్యకు ప్రధాన కారణాన్ని విశ్లేషించి, పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడింది. మొండిబకాయిలు, రూ.500 కోట్లు పైబడిన వారి పేర్ల వెల్లడికి సంబంధించి జరుగుతున్న విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్‌వేకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. భారీ రుణ బకాయిదారుల పేర్ల వెల్లడి అవకాశాలను పరిశీలించాలని ఇప్పటికే కేంద్రం, ఆర్‌బీఐలకు సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే.
రుణ రికవరీ వ్యవస్థను సరిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు (డీఆర్‌టీ), డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డీఆర్‌ఏటీ) వంటి న్యాయ వేదికల చట్టాల పటిష్టత విషయంలో చర్యలు వంటి అంశాలపై నాలుగువారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) రంజిత్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతక్రితం రంజిత్ కుమార్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ... ఎన్‌పీఏలు సహా ఇందుకు సంబంధించి వివిధ సమస్యలపై ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ వెల్లడించారు.
57 డిఫాల్టర్ల బకారుులు రూ.85,000 కోట్లు...
అంతక్రితం సొలిసిటర్ జనరల్ మొండిబకాయిదారుల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ... కేవలం 57 మంది రుణ గ్రహీతలు బ్యాంకింగ్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.85,000 కోట్లని అన్నారు. ‘‘ఈ రుణ గ్రహీతలు ఎవరు? వారు ఎంత చెల్లించాలి? ఎందుకు తిరిగి చెల్లించడం లేదు? వంటి అంశాలు ప్రజలకు ఎందుకు తెలియకూడదు’’ అని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
8,100 ఎగవేతదారులు... రూ.76,685 కోట్లు
దేశంలో 2016 మార్చి నాటికి దాదాపు 8,167 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.76,685 కోట్లని లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఏడాదిలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 16% పెరిగిందని ఆయన తెలిపారు. రూ.25 లక్షలు పైబడిన బకాయిదారుల సంఖ్య 2015 మార్చి నాటికి 7.031 మంది ఉంటే ఆ సంఖ్య 2016 మార్చి నాటికి 8,167 మందికి చేరినట్లు తెలిపారు.
అదే సమయంలో బకాయిలు 28.5 శాతం ఎగసి రూ.59,656 కోట్ల నుంచి రూ.76,685 కోట్లకు చేరినట్లు వివరించారు. 2015-16లో రూ.21,509 కోట్ల వసూళ్లకు సంబంధించి బ్యాంకులు 1,724 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసినట్లు తెలిపారు. అరుుతే ఈ కేసుల విషయంలో శిక్షలు 1.14 శాతమే ఉందని వివరించారు. అలాగే బ్యాంకులు గడచిన ఏడాది కేవలం రూ.3,498 కోట్ల బకాయిలను మాత్రమే వసూలు చేసుకోగలిగాయని తెలిపారు.