9 వేల కోట్ల డాలర్లకు భారత్ ఈ కామర్స్!
* 2021కల్లా చేరే అవకాశం
* ఈటెయిలింగ్ ఇండియా అంచనా
ముంబై: ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం 1,300 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ 2021 కల్లా 9,000 కోట్ల డాలర్లకు (రూ. 5.5 లక్షల కోట్లు) పెరుగుతుందని ఈటెయిలింగ్ ఇండియా వ్యవస్థాపకులు అశిష్ జలాని చెప్పారు. ఈ 700 శాతం వృద్ధి కారణంగా కంపెనీల భవిష్యత్ ఆన్‌లైన్ ప్రకటనల బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా మార్పులు, చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో రిటైల్ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న ఈ కామర్స్ పరిశ్రమ కొన్ని సంవత్సరాల్లోనే పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగిందని వివరించారు. యాపిల్ సంస్థ కారణంగా సంగీత పరిశ్రమలో భారీగా మార్పులు, చేర్పులు వచ్చినట్లుగానే ఈ కామర్స్ పరిశ్రమ రిటైల్ రంగాన్నే కాకుండా ప్రకటనల రంగాన్ని కూడా బాగానే ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
భారత్‌లో అధికులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి సంస్థల మొత్తం ట్రాఫిక్‌లో 35 శాతం స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే వస్తోందని వివరించారు. స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు పెరుగుతుండడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో వేల సంఖ్యలో కొత్త వినియోగదారులు అందుబాటులోకి వస్తారని వివరించారు. ఈ ఏడాది చివరి కల్లా అమెరికాలో కంటే కూడా భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని గూగుల్ ఇండియా ఇటీవలనే పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2018 కల్లా భారత్‌లో అన్‌లైన్ వినియోగదారుల సంఖ్య 50 కోట్లుగా ఉంటుందని అంచనాలున్నాయన్నారు.