ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు! | Economic cheer: September IIP at 2.5%; October CPI dips to 5.52% | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!

Published Thu, Nov 13 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!

ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!

దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంలాంటి రెండు కీలక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఒకపక్క పారిశ్రామిక రంగం పుంజుకోగా.. మరోపక్క రిటైల్ ధరలు మరింత శాంతించాయి. కార్పొరేట్ రంగానికి రానున్న రోజుల్లో ఇది సానుకూల పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రానున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

 న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వృద్ధి రేటు భారీగా పుంజుకొని 2.5 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 0.48 శాతం మాత్రమే. అయితే, క్రితం ఏడాది సెప్టెంబర్‌లో పరిశ్రమల వృద్ధి 2.7 శాతంగా ఉంది. ప్రధానంగా మైనింగ్, తయారీ, యంత్రపరికరాల రంగాల మెరుగైన పనితీరు మొత్తం పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడింది.

 ఏప్రిల్-సెప్టెంబర్‌కు ఇలా...
 ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి కూడా పరిశ్రమల ఉత్పాదకత జోరందుకుంది. ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 0.5 శాతమే కావడం గమనార్హం.

 రంగాల వారీగా...
 తయారీ: పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వెయిటేజీ ఉన్న ఈ రంగం ఉత్పాదకత సెప్టెంబర్‌లో 2.5 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 1.4 శాతం. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి చూస్తే వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 2 శాతానికి పెరిగింది. మొత్తంమీద తయారీ రంగంలోని 22 పారిశ్రామిక విభాగాల్లో 15 విభాగాలు సెప్టెంబర్‌లో వృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం.

 మైనింగ్: సెప్టెబర్‌లో ఉత్పాదకత 0.7 శాతంగా వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 3.6 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఉత్పాదకత 2.5%గా నుంచి 2.1 శాతానికి తగ్గింది.


 యంత్రపరికరాలు: డిమాండ్‌కు కొలమానంగా పరిగణించే ఈ రంగం ఉత్పాదకత వృద్ధి రేటు సెప్టెంబర్‌లో ఏకంగా 11.6 శాతానికి ఎగబాకింది. గతేడాది ఇదే నెలలో ఉత్పాదకత మైనస్ 6.6 శాతంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కూడా మైనస్ 0.6 శాతం క్షీణత నుంచి 5.8 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది.

 విద్యుత్: ఉత్పాదకత 12.9 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో మాత్రం 5.9 శాతం నుంచి 10.4 శాతానికి ఎగసింది.

 కన్జూమర్ గూడ్స్: ఉత్పాదకత 1 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మైనస్ 1.2 శాతం క్షీణత నుంచి 4.6 శాతం వృద్ధిరేటును సాధించింది.

 కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత మైనస్ 10.6 క్షీణత నుంచి మరింత తగ్గి మైనస్ 11.3 శాతానికి క్షీణించింది. ఆరు నెలల వ్యవధిలో కూడా ఉత్పాదకత మైనస్ 12.6 శాతానికి(అంతక్రితం ఇదే కాలంలో మైనస్ 11.1 శాతం) దిగజారింది.

 రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు..
 న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో రిటైల్ ధరల పెరుగుదల రేటు కూడా భారీగా తగ్గింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 5.52 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ రేటు 6.46 శాతంగా ఉంది. వరుసగా నాలుగో నెలలోనూ ఇది తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2012 జనవరిలో ఈ కొత్త సిరీస్ గణాంకాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా, బేస్ రేటు తక్కువగా ఉండటం కూడా తాజా గణాంకాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

 కూరగాయల ఎఫెక్ట్...
 సీపీఐలో ఆహార ధరల ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్‌లో 7.69 శాతంగా ఉండగా.. అక్టోబర్‌లో 5.59 శాతానికి తగ్గింది. ముఖ్యంగా కూరగాయల ధర పెరుగుదల సెప్టెంబర్‌లో 8.59 శాతంగా ఉంది(గతేడాది ఇదే నెలతో పోలిస్తే). అక్టోబర్‌లో ఈ రేటు మైనస్ 1.45 శాతంగా నమోదైంది. పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు కూడా అక్టోబర్‌లో 17.49 శాతానికి తగ్గింది(సెప్టెంబర్‌లో 22.4 శాతం). ఇక గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారోత్పుత్తలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 6.35 శాతం నుంచి స్వల్పంగా 6.34 శాతానికి తగ్గింది.

 ఆర్‌బీఐ సమీక్షపైనే అందరికళ్లూ..
 రిటైల్ ధరలు నేలకు దిగిరావడం... టోకు ధరలు కూడా కనిష్టస్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆర్‌బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గింస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న వృద్ధి రేటును గాడిలోపెట్టాలంటే వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని పారిశ్రామిక రంగం పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష జరపనుంది.

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) సెప్టెంబర్‌లో ఐదేళ్ల కనిష్టమైన 2.38 శాతానికి తగ్గడం తెలిసిందే. అక్టోబర్ గణాంకాలు రేపు(శుక్రవారం) రానున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 8 శాతానికి, 2016 మార్చినాటికి 6 శాతానికి తగ్గాలనేది ఆర్‌బీఐ లక్ష్యం. గత నాలుగు సమీక్షల్లో పాలసీ వడ్డీరేట్లను ఆర్‌బీఐ గవర్నర రఘురామ్ రాజన్ యథాతథంగా కొనసాగించడం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement