Published
Wed, May 31 2017 6:06 PM
| Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
భారత్ ఆ స్టేటస్ కోల్పోయింది
నోటు రద్దు ప్రభావం ఇంకా జీడీపీ వృద్ధిరేటుకు తగలుతూనే ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మందగించింది. దీంతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ స్టేటస్ ను కూడా భారత్ కోల్పోయింది. ఈ క్వార్టర్ లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగానే నమోదైంది. బుధవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఇదే క్వార్టర్ లో చైనా జీడీపీ వృద్దిరేటు 6.9 శాతంగా ఉంది. గత క్వార్టర్ లో కూడా ప్రొవిజనల్ 7.0 శాతంగా భారత వృద్దిరేటు ఉంది. రాయిటర్స్ పోల్ ప్రకారం ఈ క్వార్టర్ లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని అనాలిస్టులు అంచనావేశారు. కానీ అంచనాలు సైతం తప్పాయి. అంతేకాక నేడు విడుదలైన ఈ డేటా స్ట్రీట్ అంచనాలను నిరాశపరచనున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ఇటీవలే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లను పూర్తిచేసుకుంది. ఈ సమయంలో జీడీపీ వృద్ధిరేటు నిరాశపరుస్తూ వచ్చింది. ప్రధాని నవంబర్ లో తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం జీడీపీ గణాంకాలపై ఇంకా ప్రభావం చూపుతూనే ఉందని విశ్లేషకులు చెప్పారు.
2016-17కు సంబంధించిన మొత్తం ఏడాదిలో కూడా వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంది. ఇది ప్రభుత్వ అధికారులు అంచనాలకు అనుగుణంగానే వచ్చింది. భారత జీడీపీ వృద్దిరేటు వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో సుమారు 8 శాతం పెరుగుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు అంచనావేసింది. 2018లో 7.7 శాతం నమోదవుతుందని పేర్కొంది. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలుచేయబోతున్న అతిపెద్ద సంస్కరణ జీఎస్టీ, వృద్దిరేటును 2 శాతం పెంచుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. మార్చి క్వార్టర్ లో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో వృద్ధిరేటు 5.2 శాతం కాగ, మైనింగ్, క్వారింగ్ లో 6.4 శాతం వృద్ధి ఉన్నట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. తయారీ 5.3 శాతం, విద్యుత్, గ్యాస్, మంచినీళ్ల సరఫరా, ఇతర వినియోగ సేవలు 6.1 శాతం, వాణిజ్యం, రవాణా, సమాచారం 6.5 శాతం, ఆర్థికరంగం, రియల్ ఎస్టేట్, నిపుణులు సేవలు 2.2 శాతం, డిఫెన్స్, ఇతర సేవలు 17 శాతంగా వృద్ధి చెందాయి. చీఫ్ గణాంకాల అధికారి టీసీఏ అనంత్ ఈ సీఎస్ఓ డేటాను విడుదల చేశారు.