హోమ్ లోన్ సబ్సిడీ కోసం హడ్కో
హైదరాబాద్: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో)ల మధ్య తాజాగా పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో సభ్యులు గృహ కొనుగోలుకు సంబంధించి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ పొందొచ్చు. ఇంటి కొనుగోలు కోసం తన సబ్‌స్క్రైబర్లకు ఈపీఎఫ్ మొత్తం నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో).
ఈపీఎఫ్ ఖాతా నుంచే హౌసింగ్ లోన్ ఈఎంఐలు చెల్లించే అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వపు ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యానికి అనువుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు తెలియజేశాయి. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో హడ్కో చైర్మన్, ఎండీ ఎం.రవి కాంత్, ఈపీఎఫ్‌వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి.పి.జాయ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.