రికార్డ్ స్థాయికి ఎస్సార్ ఆయిల్ నికర లాభం
42 శాతం వృద్ధితో రూ.2,162 కోట్లకు
న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,162 కోట్ల నికర లాభం ఆర్జించిందని ఎస్సార్ ఆయిల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభంతో పోల్చితే 42 శాతం వృద్ధి సాధించామని వివరించింది. రిఫైనింగ్ మార్జిన్లు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఎస్సార్ ఆయిల్ చైర్మన్ ప్రశాంత్ రుయా చెప్పారు.
గుజరాత్‌లోని వాదినార్‌లో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడానికయ్యే రిఫైనింగ్ మార్జిన్ 2014–15 ఆర్థిక సంవత్సరంలో 8.37 డాలర్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో 10.81 డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,773 కోట్ల ఇబిటా ఆర్జించామని, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇబిటాతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక ఇబిటా అని వివరించారు.