బ్లాక్ మండే | Euro at Almost 11-Year Low as ECB Starts Buying Sovereign Bonds | Sakshi
Sakshi News home page

బ్లాక్ మండే

Published Tue, Mar 10 2015 1:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

బ్లాక్ మండే - Sakshi

బ్లాక్ మండే

అమెరికా వడ్డీ రేట్ల ముందస్తు పెంపు భయాలు
తాజా షార్ట్ సెల్లింగ్ ప్రభావం  
లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
ఈ ఏడాది రెండో భారీ పతనం    
సెన్సెక్స్ 604 పాయింట్లు డౌన్..28,845 వద్ద క్లోజ్
నిఫ్టీ నష్టం 181 పాయింట్లు; 8,757 వద్ద ముగింపు

ప్రపంచమంతా అంతే..
అమెరికాలో పటిష్టమైన ఉద్యోగ గణాంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.


ఈ గణాంకాలు గత శుక్రవారమే వెలువడ్డాయి. ఆ రోజు అమెరికా మార్కెట్లు 1.5 శాతం తగ్గాయి. ఈ ప్రభావం సోమవారం అన్ని దేశాల మార్కెట్లపై పడింది. ఎగుమతి గణాంకాలు బాగా ఉండటంతో షాంగై కాంపొజిట్ మాత్రం లాభాల్లో ముగిసింది. ఈ చైనా షాంగై స్టాక్ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పతన బాటలోనే సాగాయి. యూరప్‌లో జర్మనీ మినహా మిగతా ప్రధాన స్టాక్ మార్కెట్లుకూడా నష్టాల్లో ముగిశాయి.
 
బ్యాంకింగ్ సూచీ బేర్... 3 శాతం పతనం
స్టాక్ మార్కెట్ సూచీలతో సహా అన్ని ఇండెక్స్‌లు పతనబాటలోనే సాగాయి. అత్యధికంగా బ్యాకింగ్ ఇండెక్స్ 3 శాతం తగ్గింది. విద్యుత్  సూచీ 2.9 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.7 శాతం, రియల్టీ 2.5శాతం, లోహ సూచీ 2.4 శాతం, ఐటీ  2 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.6 శాతం, ఆటో 1 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.7 శాతం చొప్పున తగ్గాయి. అయితే హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రం .3 శాతం పెరిగింది.

రూపాయి బలహీనపడడం, బాండ్ల రాబడులు పెరగడం వల్ల బ్యాంక్ షేర్లు తగ్గాయని నిపుణులంటున్నారు. బ్యాంక్ ఈల్డ్‌లు పెరగడం వల్ల బ్యాంక్ సెక్యూరిటీల మార్క్-టు-మార్కెట్ విలువ ప్రభావితం అవుతుందని కేఆర్ చోక్సి షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ  దేవెన్ చోక్సి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో వివిధ సంస్థలు తమ పొజిషన్లను తగ్గించుంకుటున్నాయని ఆయన పేర్కొన్నారు.

రూపాయిదీ నేలచూపే..
ముంబై: అనుకున్న దానికంటే ముందుగానే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్టానికి క్షీణించింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే 39 పైసలు క్షీణించి 62.55 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ పతనం కావడం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 62.16తో పోలిస్తే బలహీనంగా 62.60 వద్ద ప్రారంభమైంది.

ఒక దశలో 62.73కి కూడా క్షీణించింది. ఈ ఏడాది జనవరి 8 తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఆ రోజున ఇంట్రాడేలో రూపాయి ఏకంగా 63.20 స్థాయికి పడిపోయింది. ఇక తాజాగాదేశీ కరెన్సీ 0.63 శాతం తగ్గుదలతో 62.55 వద్ద ముగిసింది. ఇక రూపాయి ట్రేడింగ్ శ్రేణి 62-63 మధ్య ఉండగలదని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.
 
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనుకున్నదానికంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచుతుందన్న భయాందోళనలతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా పతనమైంది. దీనికి తోడు రూపాయి భారీగా క్షీణించడం, తాజా షార్ట్ సెల్లింగ్  కూడా జత కావడంతో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 604 పాయింట్లు క్షీణించి 28,845 పాయింట్లకు, నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 8,757 పాయింట్లకు పతనమయ్యాయి. సోమవారం స్టాక్ సూచీలు 2 శాతం వరకూ క్షీణించాయి. బ్యాంకింగ్, విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, లోహ, ఐటీ, ఆయిల్, గ్యాస్, వాహన, ఎఫ్‌ఎంసీజీ షేర్లు భారీగా పడ్డాయి.
 
ఫెడ్ ఆందోళనలు..
అమెరికాలో నిరుద్యోగం రేటు 5.5 శాతానికి పడిపోయిందని, 2008, మే తర్వాత ఇదే కనిష్ట స్థాయని అమెరికా కార్మిక విభాగం గత శుక్రవారం వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నదానికి ఇది చిహ్నమని,  దీంతో అనుకున్నదానికంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే ఊహాగానాలు చెలరేగాయని, దీంతో  అమ్మకాలు వెల్లువెత్తాయని, స్టాక్ సూచీలు భారీగా క్షీణించాయని బ్రోకర్లు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అమెరికా బ్యాంక్ డిపాజిట్లు, డెట్ మార్కెట్ మంచి రాబడులను ఇస్తాయి. దీంతో రిస్క్ అధికంగా ఉండే భారత్ వంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి నిధులు అమెరికా డెట్ మార్కెట్‌కు తరలుతాయని నిపుణులంటున్నారు.
 
లాభాల స్వీకరణ
కార్పొరేట్ రంగానికి అనుకూలమైన నిర్ణయాలు కేంద్ర బడ్జెట్‌లో ఉండడం, ఆశించిన విధంగా  ఆర్‌బీఐ రేట్ల కోత విధించడం వంటి కీలకమైన అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవల రికార్డ్ స్థాయి ర్యాలీ జరిపాయి. షేర్లన్నీ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించి ప్రతికూల వార్త రావడంతో దేశీయ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని నిపుణులు పేర్కొన్నారు.
 
కరిగిపోయిన లోహ షేర్లు...
గ్యాప్ డౌన్‌తో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 29,317 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 29,321-28,800 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 604 పాయింట్లు నష్టపోయి 28,845 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంతకు ముందు  ఈ స్థాయి భారీ పతనం ఈ ఏడాది జనవరి 6న సంభవించింది. ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 855 పాయింట్లు(3%)క్షీణించింది. నిఫ్టీ కూడా ఈ రోజు 251 పాయింట్లు పతనమైంది. సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ విలీనానికి పం జాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఇది ఆఖరి ఆమోదం.

దీంతో ఈ రెండు షేర్లు రికార్డు స్థాయిలను తాకాయి (సన్ ఫార్మా రూ.1,049, ర్యాన్‌బాక్సీ రూ.826).చివరకు సన్ ఫార్మా రూ.1,041 వద్ద, ర్యాన్‌బాక్సీ రూ.818 వద్ద ముగిశాయి. బొగ్గు గనులను చేజిక్కించుకోవడానికి పలు లోహ కంపెనీలు ఎక్కువ మొత్తంలో సొమ్ములు వెచ్చిస్తున్నాయని, దీంతో వీటి లాభదాయకతపై ప్రభావం పడుతుందనే అంచనాలతో లోహ షేర్లు క్షీణించాయి. టీసీఎస్ గెడైన్స్ బాగా లేకపోవడంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి.
 
4 సెన్సెక్స్ షేర్లకే లాభాలు...
30 షేర్ల సెన్సెక్స్ ఇండెక్స్‌లో 26 షేర్లు నష్టపోగా, 4 షేర్లే లాభాల్లో నిలిచాయి. వీటిలో హిందూస్తాన్ యూనిలివర్ 3.7 శాతం,  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.5%, సన్ ఫార్మా 0.4%, మారుతీ సుజుకీ 0.01% చొప్పున పెరిగాయి.  1,889 షేర్లు నష్టాల్లో, 977 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,610 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.18,432 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,48,485 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.838 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.35 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
 
‘స్పార్క్’ వెలుగులు
సన్ ఫార్మా అనుబంధ సంస్థ అయిన సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీ(స్పార్క్) షేర్ జోరుగా పెరుగుతోంది. సోమవారం ఈ షేర్ ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం వృద్ధి చెంది రూ.544 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.564ను తాకింది. ఈ కంపెనీ ఇటీవలనే మూర్ఛ వ్యాధిలో ఉపయోగించే ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఆనుమతి పొందిన విషయం తెలిసిందే. ఈ షేర్ 3 సెషన్లలో  రూ.412 నుంచి 34 శాతం వృద్ధి చెందింది.  ఇక ఈ ఏడాది ప్రారంభంలో రూ.187గా ఉన్న ఈ షేర్ ధర ఇప్పటివరకూ 200 శాతం ఎగబకడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement