
స్టాక్‌మార్కెట్లలో హెచ్చుతగ్గులుండే నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి అధిక రాబడులొస్తాయనే అంచనాలను తగ్గించుకోవాలని, సముచిత రాబడులనే ఆశించాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నేషనల్ సేల్స్ హెడ్ పెషోతన్ దస్తూర్ అభిప్రాయపడ్డారు. సిప్‌లను మధ్యలోనే ఆపేయకుండా దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే మంచి ప్రయోజనాలు పొందవచ్చని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంస్థ లక్ష్యాలు, రాబోయే రోజుల్లో మార్కెట్ల తీరు తదితర పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
సిప్‌లకు ఈ మధ్య బాగా ఆదరణ పెరిగింది. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి?
ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్‌ని అనుమతించి దాదాపు పాతికేళ్లవుతోంది. ఇందులో తొలి ఇరవై రెండేళ్లలో సిప్ ఖాతాలు దాదాపు డెభ్భై అయిదు లక్షలకు పరిమితమయ్యాయి. కానీ ఈ మూడేళ్లలోనే ఏకంగా మరో డెబ్భై అయిదు లక్షల సిప్ ఖాతాలు వచ్చి చేరాయి. అంటే ఇరవై రెండేళ్లూ ఒక ఎత్తు.. ఈ మూడేళ్లు మరో ఎత్తు. ప్రస్తుతం పరిశ్రమలో దాదాపు 1.5 కోట్ల సిప్‌లున్నాయి.
ప్రతి నెలా దాదాపు రూ.5,000 కోట్ల పైగా నిధులు సిప్‌ల ద్వారా వస్తున్నాయి. సగటున సిప్ పరిమాణం రూ. 3,500గా ఉంటోంది. ఇక మా సంస్థ విషయానికొస్తే.. మా దగ్గర దాదాపు 13 లక్షల సిప్ ఖాతాలున్నాయి. వీటి ద్వారా రూ. 425 కోట్ల మేర ప్రతి నెలా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. మా నిర్వహణలోని అసెట్స్ విలువ రూ.1.03 లక్షల కోట్లు. ఇందులో సింహభాగం ఈక్విటీలోను, మిగతాది డెట్, క్యాష్ సాధనాల్లోను ఉంది. రూ.లక్ష కోట్ల ఏఎంసీ దాటిన సంస్థల్లో మాది ఎనిమిదో స్థానం.
సిప్‌లలోకి ఇన్ని నిధులు రావటానికి కారణమేంటి?
కారణాలు చాలా ఉన్నాయి. మెరుగైన మరో సాధనం అందుబాటులో లేకపోవడం కూడా వీటిలో ఒకటి. రెండోది ఈక్విటీ మార్కెట్లు బాగున్నాయని అందరూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక మూడో దానికొస్తే.. టీవీల్లోనూ, పేపర్లలోనూ ప్రచారం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన పెరిగింది. నాలుగోది.. మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మెరుగైన మార్గం.
అన్నింటికన్నా ముఖ్యమైన అయిదో అంశం.. టెక్నాలజీ. ఇన్నాళ్లదాకా పేపర్ వర్క్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డిజిటల్ విధానం రావడంతో ఖాతా తెరవడం నుంచి ఇతర లావాదేవీల నిర్వహణ దాకా అంతా అత్యంత సులభతరంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే నిర్వహించుకునే వెసులుబాటు వచ్చింది. ఇవన్నీ కలసి ఫండ్స్, సిప్స్‌కి ఆదరణ పెంచుతున్నాయి.
కొత్తగా వచ్చేవే కాకుండా.. మధ్యలోనే ఆపేస్తున్నవి కూడా ఉన్నట్లున్నాయి కదా..?
నిజమే. కొత్తగా రెండు సిప్ ఖాతాలు వచ్చాయంటే.. ఒకటి ఆగిపోతోంది. అలా జరగకుండా ఉంటే.. ఇప్పుడు సిప్‌ల సంఖ్య 3 కోట్లు దాటేసి ఉండేది. ఏప్రిల్ 2016–మార్చి 2017 మధ్య 75 లక్షల సిప్‌లు రిజిస్టర్ అయితే.. 36 లక్షల పాత సిప్‌లు ఆగిపోయాయి. అంటే నికరంగా 39 లక్షలే కొత్తగా జతయినట్లు అయింది. మార్కెట్లు బాగున్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక క్షీణించినప్పుడు ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 40 లక్షల ఖాతాలు వస్తే 75 లక్షలు ఆగిపోయేట్లుగా ఉంటుంది.
2003–2008 మధ్యలో మార్కెట్లు అదే పనిగా పెరిగాయి. అలాగే పదేళ్ల తర్వాత మళ్లీ 2013 నుంచి 2017 దాకా ఇదే ధోరణి సాగింది. 2008లో మార్కెట్లు పడ్డాయి కాబట్టి.. ఇప్పుడూ పడతాయన్నది నా అభిప్రాయం కాదు. 2008 నుంచి 2013 మధ్యలో ఇన్వెస్టర్లు తీవ్ర హెచ్చుతగ్గులు, ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవధిలోనే సిప్ బలం బయటపడింది.
తక్కువలో కొనుక్కునేందుకు, కాస్ట్ యావరేజింగ్ చేసుకునేందుకు, దీర్ఘకాలంలో మరింత రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడింది. కానీ ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్లు గత పరిస్థితులను చూడలేదు. అందుకే ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా సిప్‌ను ఆపొద్దనే మేం సూచిస్తున్నాం. నిధుల సమస్య ఏదైనా వస్తే ఒకటిరెండు నెలలు గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రారంభించే వెసులుబాటు కూడా ఫండ్ సంస్థలు కల్పిస్తున్నాయి.
సిప్ చేస్తే నష్టాలు అస్సలు ఉండవనే గ్యారంటీ ఉందా?
నిజానికి.. కాంపౌండింగ్, యూనిట్లు కూడబెట్టుకోవడం, రూపీ కాస్ట్ యావరేజింగ్ వంటి అంశాలు సిప్‌లకు ప్రధాన బలాలు. సిప్‌ను మధ్యలోనే ఆపేయడం వల్ల ఈ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. సిప్‌లలోకి ఇకపైనా నిధుల ప్రవాహం కొనసాగుతుంది. అయితే, సిప్ చేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవనే ఆలోచన కరెక్టు కాదు. మార్కెట్లలో హెచ్చుతగ్గుల రిస్కులుంటాయని తెలుసుకున్నాకే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం మంచిది. కేవలం బుల్ మార్కెట్ మాత్రమే ఉండదు.
వివిధ దశల గుండా మార్కెట్ సాగుతుంది. రాజకీయ, ఆర్థిక, భౌగోళికపరమైన అనేకానేక అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. కేవలం బుల్ మార్కెట్ మాత్రమే ఉంటుందని భావించకుండా ఈ దశలన్నింటినీ ఎదుర్కొని ఇన్వెస్ట్‌మెంట్ సాగించగలగాలి. తద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనాలు పొందవచ్చు. దాదాపు పాతికేళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న మా సంస్థ ఫండ్... ఈ కాలంలో సెన్సెక్స్ కన్నా రెట్టింపు స్థాయిలో సగటున 20 శాతానికి పైగా రాబడులిచ్చింది.
అధిక రాబడులపై అంచనాలు సరైనవేనంటారా?
ఇప్పుడున్న ధోరణి ఇకపైనా కొనసాగుతుందా.. అంటే కష్టమే. అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ.. రిటర్న్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన రాబడులు చాలా ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవాలి. రిస్కులూ ఉంటాయని గుర్తించాలి. భారీ అంచనాలను తగ్గించుకోవాలి. గత మూడేళ్లలో ఇరవై శాతం రాబడులొచ్చినప్పుడు మరో మూడేళ్లు అదే స్థాయిలో రాబడులు ఎందుకు రావనే ధోరణి ఉంటోంది. కానీ వాస్తవానికి రాబోయే మూడేళ్లలో అందాల్సిన ఫలాలన్నీ కూడా ఇప్పుడే చేతికొచ్చేశాయి. ఇరవై శాతం అంటేనే చాలా అధిక రాబడి.
ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి అధిక రాబడులపై అంచనాలను తగ్గించుకోవాలి. ద్రవ్యోల్బణం 4 శాతం ఉండి.. ఎఫ్‌డీలు 6.5 శాతం, కార్పొరేట్ బాండ్లు 8 శాతం–9 శాతం మేర రాబడులు ఇస్తున్న పరిస్థితుల్లో ఈక్విటీలు వాటన్నింటికీ రెట్టింపు స్థాయిలో ఏకంగా 20 శాతం మేర రాబడులు ఇవ్వజాలవు. ఇలాంటి సందర్భాల్లో ఈక్విటీల నుంచి ఒక మోస్తరుగా 12 – 13 శాతం మేర రాబడులు మాత్రమే ఆశించడం సముచితంగా ఉంటుంది. అయితే, ఇప్పటికీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా అవకాశాలే ఉన్నాయి. లార్జ్‌క్యాప్స్ కావొచ్చు, మిడ్‌క్యాప్ కావొచ్చు మరేదైనా కావచ్చు. ఖరీదైనవిగా కనిపిస్తున్నా.. మల్టీబ్యాగర్స్‌గా నిల్చే స్టాక్స్ చాలానే ఉన్నాయి.
మీ ఫండ్ ప్రత్యేకంగా ఏ రంగాలమీదైనా దృష్టి పెట్టారా?
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రత్యేకంగా ఏ రంగంపైనా దృష్టి పెట్టదు. ఏ రంగంలోనైనా తక్కువలో లభిస్తూ.. మెరుగైన రాబడులు అందించగలిగే స్టాక్స్ మాత్రమే మా ఫండ్స్ ఎంపిక చేసుకుంటుంది.
డీమోనిటైజేషన్ ముందు, తర్వాత ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం ఎలా ఉంది?
కేవలం డీమోనిటైజేషన్ వల్ల ఫండ్స్‌లోకి నిధులు వచ్చాయనుకోవడం లేదు. నిజానికి డీమోనిటైజేషన్ వల్ల ఫండ్స్‌లోకి నిధులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ముందుగా బ్యాంకుల్లోకి భారీగా డిపాజిట్లొచ్చాయి. దీంతో అవి వడ్డీ రేట్లు తగ్గించాయి. ఫలితంగా మెరుగైన రాబడులు అందించే సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూడటం మొదలుపెట్టారు. ఎఫ్‌డీలు, డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారాన్ని దాటి ఈక్విటీలు మెరుగ్గా కనిపిస్తుండటంవల్ల వాటివైపు మళ్లారు.
అయితే, ఇలాంటి పరిస్థితి సిస్టమిక్ రిస్క్‌కు దారితీస్తుందని నా అభిప్రాయం. తగినంత రిస్క్ సామర్ధ్యం లేకపోయినా కేవలం అధిక రాబడులొస్తాయనే ఏకైక కారణంతో మిగతా సాధనాలన్నీ వదిలేసి.. ఎఫ్‌డీలు మొదలైన వాటిల్లో ఉన్న డబ్బునంతా కూడా ఈక్విటీల్లోకి మళ్లించేయడం వల్ల వ్యవస్థాగతమైన రిస్కు పరిస్థితి తలెత్తుతుంది. ఇన్వెస్టరైనా, అడ్వైజరైనా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రిస్కు సామర్ధ్యానికి తగ్గ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అందరూ ఏదైనా సాధనంలో రాబడుల గురించే మాట్లాడుతున్నారంటే.. మనం రిస్కుల గురించి ఆలోచించాల్సిన సమయం అని అర్థం చేసుకోవాలి.
పరిశ్రమ, మీ సంస్థ వృద్ధి లక్ష్యాలేంటి?
ప్రస్తుతం ఇండస్ట్రీ పరిమాణం రూ.22.5 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సుమారు నలభై శాతం.. అంటే రూ. 8.5 లక్షల కోట్లు ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఉంది. రూ.6.5 లక్షల కోట్లు క్యాష్ ఫండ్స్‌లో ఉంది. మరో 30 శాతం డెట్ ఫండ్స్‌లో ఉంది.
2025 నాటికి ఈ పరిశ్రమ రూ. 95 లక్షల కోట్ల స్థాయికి చేరగలదని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా. 2021 నాటికి రూ.2.5 లక్షల కోట్ల ఏఎంసీగా నిలవాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం ఇది రూ.1.03 లక్షల కోట్లుగా ఉంది. పరిశ్రమ 22 ఏళ్లలో సాధించిన సిప్‌లు.. మూడేళ్లలోనే సాధించగలిగినప్పుడు మా సంస్థ మరో మూడేళ్లలో రెట్టింపు ఏఎంసీ లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదన్నది మా అభిప్రాయం.
(సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి)