రిటైరైన తర్వాత అధిక రిస్క్‌ వద్దు! | Expert Advice on Investment in Index After Retirement | Sakshi
Sakshi News home page

రిటైరైన తర్వాత అధిక రిస్క్‌ వద్దు!

Published Mon, Feb 24 2020 8:13 AM | Last Updated on Mon, Feb 24 2020 8:13 AM

Expert Advice on Investment in Index After Retirement - Sakshi

నేను ఇండెక్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇవి ఈక్విటీ ఫండ్స్‌కంటే మంచి రాబడులనే ఇవ్వగలవా? ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చంటారా?      –సుచరిత, హైదరాబాద్‌  
ఇండెక్స్‌ ఫండ్స్‌కు ఉండే ప్రధాన ప్రయోజనం.... వ్యయాలు తక్కువగా ఉండటం. ఇవి సూచీలను ప్రతిబింబిస్తాయి. సెన్సెక్స్‌ లేదా నిఫ్టీల రాబడులను మించి రాబడులను సా«ధించడమనేది ప్రతి ఇన్వెస్టర్‌ ఆశించే లక్ష్యాల్లో ప్రధానమైనది. ఈ లక్ష్యాన్ని అయితే ఇండెక్స్‌ ఫండ్స్‌తో సాధించలేం. ఇండెక్స్‌ ఫండ్స్‌కు ఉన్న ప్రధాన అవరోధం ఇదే. 2018లో గానీ, 2019లో గానీ ఏ ఫండ్‌ కూడా ఇండెక్స్‌ ఫండ్‌ను మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. అయితే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా ఫండ్స్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌కు మించిన రాబడులనిచ్చాయి.  సూచీల స్థాయి రాబడులు చాలు, వ్యయాలు తక్కువగా ఉండాలనుకుంటే ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదల్చుకున్నా, ఇండెక్స్‌ ఫండ్స్‌ను మించి రాబడులు రావాలనుకున్నా, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవడమే మేలు. 

రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే అవసరాల కోసం ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ప్రీమియమ్‌ను వెనక్కి ఇచ్చే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిటైర్మెంట్‌ అవసరాలను తీర్చుకోవచ్చా? ఇది సరైన నిర్ణయమేనా?     –సూరి, విశాఖపట్టణం  
ఇది అస్సలు సరైన నిర్ణయం కాదు. బీమా వేరు. ఇన్వెస్ట్‌మెంట్‌ వేరు. ఈ రెండింటి అవసరాలు కూడా వేర్వేరుగా ఉన్నట్లుగానే, మదుపు కూడా విడివిడిగానే ఉండాలి. ఎప్పుడూ ఈ రెండింటిని కలపకూడదు. ప్రీమియమ్‌ వెనక్కి ఇచ్చే బీమా పాలసీలు ఒక విధంగా చెప్పాలంటే ఎరల్లాంటివే. బీమా అవసరాల కోసం పూర్తిగా టర్మ్‌ ప్లాన్‌లనే తీసుకోవాలి.  టర్మ్‌ ప్లాన్, తగిన ఆరోగ్య పాలసీలు తీసుకుంటే ఇక వేరే బీమా ప్లాన్‌ల కోసం ఆలోచించాల్సిన పని లేదు. ఇక రిటైర్మెంట్‌  అవసరాల కోసం కనీసం పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగేలా ఉంటే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ప్రతీ ఏడాది ఈ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. కనీసం రెండేళ్లకొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తూ ఉండండి.  

నేను ఇటీవలనే రిటైరయ్యాను. క్రమం తప్పని ఆదాయం కోసం మాలాంటి రిటైరైన వ్యక్తులకు అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆప్షన్స్‌ ఏంటి?      –ప్రభాకర్, విజయవాడ  
రిటైరైన తర్వాత పెన్షన్‌ తప్ప మరో ఆదాయం ఉండదు కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి. క్రమం తప్పని ఆదాయం వచ్చేలా ఇన్వెస్ట్‌ చేయాలి. అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎంచుకోవాలి. గతంలో జీవితం సాఫీగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. గతంలో డిపాజిట్లు, బాండ్లు, సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్, లేదా ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, ఈ సాధనాలన్నీ ద్రవ్యోల్బణాన్ని బీట్‌ చేసే రాబడులనిచ్చేవి. భవిష్యత్తులో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సాధనాలకు ఇంత సీన్‌ ఉంటుందనుకోవడం లేదు. వీటిపై రాబడులు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి. రిటైరైన తర్వాత అధిక రిస్క్‌ తీసుకోకూడదు. అధిక రిస్క్‌ తీసుకుంటే, అధిక రాబడులు వచ్చే విషయం వాస్తవమే అయినప్పటికీ, ఒక వేళ నష్టాలు వస్తే, దానిని భరించడం కష్టసాధ్యమే. అయినప్పటికీ, రిస్క్‌ అధికంగా ఉండే ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్‌ చేయాల్సిందే. రిటైరైన వాళ్లకు వేరే సంపాదన ఉండదు.

ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పైననే ఆధారపడి ఉండాలి. అందుకని ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ. కోటి వచ్చాయనుకుందాం. 8 శాతం రాబడి లెక్కన నెలకు రూ.66,000 వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నెల గడవడానికి ఈ మొత్తం సరిపోతుంది. కానీ ఐదేళ్ల తర్వాత? ద్రవ్యోల్బణం 10 శాతం చొప్పున లెక్కేసుకుంటే, మీకు ఇంకా ఎక్కువ మొత్తమే అవసరం. ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు వృద్ధిని కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సాధించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు, డెట్‌ ఫండ్స్‌ వంటి ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలు మీ పెట్టుబడికి రక్షణ నిస్తాయే కానీ, పెద్దగా రాబడులను ఇవ్వలేవు. మీ పెట్టుబడి వృద్ధి చెందేలాగా, భవిష్యత్తు అవసరాలు తీరేలాగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. దీనికి అసెట్‌–అలకేషన్‌ విధానాన్ని అనుసరించవచ్చు. మీ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతాన్ని ఈక్విటీలో, మిగిలింది డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement