
సుధాకర్ కాస్త సంప్రదాయ వాది. బ్యాంకింగ్‌లో కావచ్చు... బీమా రంగంలో కావచ్చు... ఆఖరికి టెలిఫోన్ కనెక్షన్ విషయంలో కావచ్చు!! ఎక్కడైనా ప్రభుత్వ రంగాన్నే నమ్ముతాడు. ప్రయివేటు రంగంలో చక్కని ఆఫర్లున్నా సరే... అదంతా మోసమని కస్టమర్లను ఉచ్చులోకి లాగటానికి ఆ వల విసురుతుంటారని అందరితో చెబుతుంటాడు.
ఎవరు విన్నా... వినకపోయినా తను మాత్రం ఎక్కువగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడ్డాడు. కాకపోతే ఈ మధ్య బ్యాంకింగ్‌కు సంబంధించి తను పునరాలోచనలో పడ్డాడు. తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలేమో అనుకుంటున్నాడు కూడా!! ఎందుకంటే ఒకటి రెండు విషయాల్లో ప్రయివేటు బ్యాంకులే బెటరనుకునే అనుభవాలు ఎదురయ్యాయి మరి!!
సుధాకర్‌కి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వాడుతున్నాడు. తన మిత్రుడు శ్రీకర్‌కు మాత్రం ఓ అగ్రశ్రేణి ప్రయివేటు బ్యాంకులో ఖాతా ఉంది. కాకపోతే ఇద్దరూ ఈ మధ్య విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. మరి వీసా కోసం దరఖాస్తు చేయాలి కదా? వీసా దరఖాస్తు కోసం 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
కాకపోతే నేరుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న స్టేట్‌మెంట్ కుదరదు. బ్యాంకు సిబ్బంది ప్రింట్ తీసి, దానిపై స్టాంపు వేసి ఇస్తేనే చెల్లుతుంది. దీంతో సుధాకర్, శ్రీకర్ ఇద్దరూ వాళ్ల వాళ్ల బ్యాంకులకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే...!
సుధాకర్ తన బ్యాంకు స్టేట్‌మెంట్ కోసం వెళ్లి అక్కడో ఫారం నింపి ఇచ్చాడు. స్టేట్‌మెంట్ వచ్చింది. 5 పేజీల స్టేట్‌మెంట్‌ను బ్యాంకు సిబ్బంది అప్పటికప్పుడే ఇచ్చేశారు. హమ్మయ్య! అనుకుంటూ బయటికొచ్చాడు సుధాకర్. ఇంతలో తన మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. స్టేట్‌మెంట్ తీసుకున్నందుకు రూ.600 మినహాయించుకున్నట్లు బ్యాంకు పంపిన మెసేజ్ అది!!.
నిజానికి సుధాకర్ ఎప్పుడూ బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకోలేదు. అవసరమైనపుడు తన ఇంటర్నెట్ ఖాతా ద్వారా తనే ప్రింట్ తీసుకునేవాడు. అలాంటిది ఒకసారి బ్యాంకుకెళ్లి 5 పేజీల స్టేట్‌మెంట్ తీసుకున్నందుకు రూ.600 కోతపడేసరికి దిమ్మదిరిగిపోయింది. బ్యాంకుకెళ్లి అడిగితే... అవి రూల్స్ అని, రూల్స్ ప్రకారమే కోత పడిందని చెప్పారు. అంతే!!.
మరి శ్రీకర్ పరిస్థితేంటి? శ్రీకర్ తన బ్యాంకుకెళ్లాడు. స్టేట్‌మెంట్ అడిగాడు. దాదాపు 6 పేజీల స్టేట్‌మెంట్‌ను వాళ్లు కూడా ఇచ్చారు. కాకపోతే శ్రీకర్ ఖాతాలోంచి రూపాయి కూడా కట్ కాలేదు. ఎందుకంటే ప్రతి 6 నెలల్లో ఒకసారి ఉచితంగా స్టేట్‌మెంట్ తీసుకోవచ్చన్నది ఆ బ్యాంకు నిబంధన. అప్పటిదాకా శ్రీకర్ కూడా బ్యాంకు నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదు కాబట్టి... శ్రీకర్‌కు దాన్ని ఉచితంగా ఇచ్చారు. ఎలాంటి చార్జీలు ఖాతా నుంచి మినహాయించుకోలేదు.
మరో సంఘటన చూద్దాం!!. ఓ అప్లికేషన్‌పై ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు అటెస్టేషన్ అవసరమైంది. ఈ విషయంలో కూడా సుధాకర్, శ్రీకర్ ఇద్దరూ వాళ్ల బ్యాంకులకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఆ అప్లికేషన్ తీసుకుని, దానిపై సంతకం చేసి, స్టాంపు వేసి ఇచ్చారు. కాకపోతే దీనికి సుధాకర్ ఖాతా నుంచి రూ.175 కోత పడింది. శ్రీకర్ ఖాతాలో మాత్రం రూ.100 మాత్రమే కోత పడింది. అయినా ఇదేకాదు!! శ్రీకర్ ఈ మెయిల్‌కు తన బ్యాంకు నుంచి ప్రతి మూడు నెలలకోసారి బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ వస్తుంటుంది.
దానికి శ్రీకర్ నుంచి ఎలాంటి చార్జీలూ వసూలు చేయరు. అంటే ఒకవేళ ఏదైనా దరఖాస్తుకు బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తే దీన్ని కూడా ఇవ్వవచ్చన్న మాట. కాకపోతే సుధాకర్‌కు మాత్రం ఎలాంటి స్టేట్‌మెంట్లూ రావు. బ్యాంకుకెళితే చార్జీల బాదుడు తప్పదు. అదీ సంగతి!!. మరిప్పుడు సుధాకర్ ఏం చేయాలి? ప్రభుత్వ రంగంలోని తన బ్యాంకే బెటరనుకోవాలా? లేక ప్రయివేటు బ్యాంకులే బెటరనుకోవాలా?
నిజానికిప్పుడు చార్జీల విషయంలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు రెండూ దొందుకు దొందేనని చెప్పాలి. కాకపోతే అటు సేవల విషయంలోను, కొన్ని చార్జీల విషయంలోను మాత్రం ప్రయివేటు బ్యాంకులే మెరుగ్గా ఉన్నాయి. మరి చిన్న చిన్న జీతగాళ్లతో పాటు కోట్ల మంది నమ్ముకున్న ప్రభుత్వ బ్యాంకులు ఇలా ఎడాపెడా చార్జీలు బాదేస్తూ ప్రయివేటు బ్యాంకులతో పోటీ పడుతుంటే ఏం చేయాలి? ప్రయివేటు బ్యాంకులకన్నా తాము రెండాకులు ఎక్కువే చదివామన్నట్లుగా వ్యవహరిస్తుంటే కర్తవ్యమేంటి?
బ్యాంక్ మేనేజర్ సంతకానికి రూ.175..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా ఈఎస్‌ఐ, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లుల క్లయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆయా అధికారులు దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతున్నారు.
ఇందుకోసం సంబంధిత బ్రాంచి మేనేజర్ సంతకం, స్టాంప్ ఉండాల్సిందేనంటున్నారు. గత్యంతరం లేక బ్యాంకును సంప్రదిస్తే–ఎస్‌బీఐలో అటెస్టేషన్ చార్జీలు రూ.175, మిగతా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో దీనికి రూ.100 వసూలు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో బదిలీ చేసినా చార్జీలే!
కేంద్రం డిజిటల్ చెల్లింపులంటూ ఊదరగొడుతున్నా బ్యాంకులు మాత్రం చార్జీల మోత మోగిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి ఐఎంపీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, యూపీఐ తదితర ఆప్షన్లున్నాయి. ఎస్‌బీఐలో ఎన్‌ఐఎఫ్‌టీ చార్జీలు రూ.10 వేల వరకైతే రూ.2.50, లక్షకైతే రూ.5, రూ.2 లక్షల వరకైతే రూ.15, రూ.2 లక్షల పైనైతే రూ.25 కట్టాల్సిందే.
ఆర్‌టీజీఎస్‌లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకైతే రూ.25, ఆపైన జరిపే ప్రతి లావాదేవీ మీద రూ.50, ఐఎంపీఎస్‌లో అయితే రూ.1,000 వరకు ఉచితం. ఆపైన రూ.10 వేల వరకు ప్రతి లావాదేవీకి రూ.2, రూ.లక్ష వరకైతే రూ.4, రూ.2 లక్షల వరకైతే ప్రతి లావాదేవీ మీద రూ.12 చార్జీలుంటాయి.
కనీస నిల్వల్లో ఎవరికి వారే!!
కనీస నగదు నిల్వల పరిస్థితైతే దారుణం. కరెంట్ ఖాతాల్లోనే కాదు.. పొదుపు ఖాతాల్లోనూ మినిమం బ్యాలెన్స్ లేకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని బ్యాంకులూ అపరాధ రుసుములు వసూలు చేస్తున్నాయి. మెట్రోల్లో ఎస్‌బీఐ కనీస నగదు నిల్వ రూ.3 వేలు. లేని పక్షంలో రూ.20–40 వరకు చార్జీలున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో పొదుపు ఖాతాల్లో కనీసం రూ.10 వేలు ఉండాలని, కొన్ని అంతర్జాతీయ బ్యాంకులైతే రూ.లక్ష వరకు ఉండాల్సిందేనని షరతులు విధించాయి. లేకపోతే జీఎస్‌టీతో కలిపి రూ.500– 700 వరకు చార్జీలున్నాయి.
బ్యాంకుకెళ్లి డిపాజిట్ చేసినా మోతే!
ఆన్‌లైన్‌లోనే కాదండోయ్.. బ్యాంకుకు వెళ్లి నగదును డిపాజిట్ చేసినా చార్జీల మోత తప్పదు. ఎస్‌బీఐ తొలి 3 డిపాజిట్లు మాత్రమే ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ప్రతి డిపాజిట్‌కు రూ.50. ప్రైవేట్ బ్యాంకులైతే ఉచిత లావాదేవీలు ముగిశాక ప్రతి లావాదేవీ మీద రూ.150 వసూలు చేస్తున్నాయి.
ఏటీఎం నిర్వహణకూ చార్జీలే..
సొంత బ్యాంకు ఏటీఎంలో అయినా ఇతర బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు డ్రా చేస్తే చార్జీలున్నాయి. ఎస్‌బీఐలో మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలో అయితే 3 సార్లు, పట్టణాల్లో అయితే 5 సార్లు ఉచితం. ఆ తర్వాత ప్రతి లావాదేవీ మీద సొంత బ్యాంకు ఏటీఎంలో అయితే రూ.10, ఇతర బ్యాంకు ఏటీఎంలో అయితే రూ.20 చార్జీ ఉంటుంది.
ఎస్‌బీఐలో సాధారణ డెబిట్ కార్డు జారీకి ఎలాంటి చార్జీలు లేవు. కానీ, గోల్డ్ డెబిట్ కార్డు జారీకి అయితే రూ.100, ప్లాటినం డెబిట్ కార్డుకైతే రూ.300, చార్జీ విధిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే డెబిట్ కార్డు జారీకి చార్జీ లేదు కానీ, ఏటా కార్డు నిర్వహణకు రూ.120 చార్జీ వసూలు చేస్తుంది.
చిరిగిన నోట్లు మారిస్తే..
నోట్లు చిరిగిన లేదా శిథిలావస్థకు చేరిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకూ చార్జీలున్నాయి. ఎస్‌బీఐలో అయితే నోట్ల విలువ రూ.5 వేలకు మించితే ప్రతి నోటుకు రూ.2 చొప్పున వసూలు చేస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి ఆన్‌లైన్ ద్వారా బస్సు లేదా రైలు టికెట్లు లేదా కరెంట్ బిల్లు స్థానిక సంస్థల ఫీజులు చెల్లించినా సరే చార్జీలున్నాయి.
ఆయా సేవలకు మొత్తం విలువపైన డెబిట్ కార్డుతో అయితే 0.75–1.5 శాతం, క్రెడిట్ కార్డుతో అయితే 1.75–2.5 శాతం వరకు చార్జీలున్నాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించినా సరే రూ. 10తో పాటూ జీఎస్‌టీ కట్టాల్సిందే.
చెక్, డీడీ, స్టేట్‌మెంట్‌కూ మోతే!
చెక్ బుక్‌కు, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), స్టేట్‌మెంట్ అన్నింటికీ చార్జీలున్నాయి. ఎస్‌బీఐ ఖాతాదారులు త్రైమాసికంలో లక్ష కంటే తక్కువ బ్యాలెన్స్ నిర్వహణ చేసేవారికి చెక్‌బుక్ తొలి 25 పేజీలు ఉచితం.
ఆ తర్వాత 10 చెక్‌లకు రూ.30, 25 చెక్‌లకు రూ.75, 50 చెక్‌లకు రూ.150 చెల్లించాలి. జీఎస్‌టీ అదనం. ప్రయవేటు బ్యాంకులతో పాటు చాలా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా కాల పరిమితిని బట్టి ఉచిత స్టేట్‌మెంట్లు ఇచ్చే సదుపాయం ఉన్నా... స్టేట్ బ్యాంకు మాత్రం దీనికి భారీగానే వసూలు చేస్తోంది. ఎస్‌బీఐలో రూ.5 వేల డీడీకి రూ.25, రూ.10 వేలకు రూ.50, లక్షకైతే ప్రతి 1,000కి రూ.5 చార్జీ కట్టాల్సిందే.
ఎస్‌ఎంఎస్, మొబైల్ వ్యాలెట్‌కూ బాదుడే!
ఖాతాలో నగదు పడినా, లేదా డ్రా చేసినా వెంటనే మొబైల్‌కు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్) వచ్చేలా పెట్టుకున్నారా! అయితే మీ జేబుకు చిల్లే. ఎస్‌ఎంఎస్ సేవలకు గాను ప్రతి బ్యాంకు 3 నెలలకొకసారి రూ.15 వసూలు చేస్తున్నాయి.
అంతేకాదు నగదు ఒకే సంస్థకు చెందిన ఒక వ్యాలెట్ నుంచి మరొక దానికి బదిలీ చేసినందుకు కొన్ని సంస్థలు ఉచితంగా అందిస్తే, మరికొన్ని రూ.10–20 వరకు చార్జీ చేస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా ఆన్‌లైన్ బ్యాంకు ద్వారా నగదు రీచార్జి చేసినప్పుడు ఉచితంగా సేవలందిస్తున్నాయి. కానీ, ఆ నగదు అవసరానికి తిరిగి బ్యాంకు ఖాతాలోకి మళ్లించేందుకు నగదు విలువ ప్రకారం రూ.10–100 వసూలు చేస్తున్నాయి.
సర్వీసుల్లో పోటీ ఏదీ?
చార్జీల విషయంలో ప్రభుత్వ బ్యాంకులు తామేమీ తక్కువ తినలేదన్నట్లు ప్రయివేటు బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. కానీ సేవల్లో మాత్రం... నాసిరకమే!! బ్యాంకుకెళితే సిబ్బంది తీరు ఎలా ఉంటుందన్నది అందరికీ అనుభవమే.
ప్రయివేటు బ్యాంకులు ఆటోమేషన్‌తో సిబ్బందిని నేరుగా కలవాల్సిన అవసరాన్ని తప్పిస్తుండగా... ప్రభుత్వ బ్యాంకులు దీనికింకా ఆమడ దూరంలోనే ఉన్నాయి. పైగా ఎస్‌బీఐ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల్లో చెక్‌బుక్ కోసం రిక్వెస్ట్ పెడితే... 10–12 రోజులు పడుతుందనే సమాచారం రావటంతో పాటు... దాదాపు అంతే సమయం తీసుకుంటున్నారు కూడా!! అదే ప్రయివేటు బ్యాంకులైతే 3–4 రోజుల్లోనే చెక్‌బుక్‌ను పంపిస్తున్నాయి.
ఇంటర్నెట్ సేవలు మరీను!!
ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దాదాపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలందిస్తున్నా... రెండుమూడు అగ్రశ్రేణి బ్యాంకులు తప్ప మిగతావన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ దిగ్గజ బ్యాంకులు కూడా తరచూ సేవలకు అంతరాయం కలగటం, నెట్‌బ్యాంకింగ్ పనిచేయకపోవటం, ఒకవేళ కస్టమర్ ఎవరైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమస్యల గురించి బ్యాంకు సిబ్బందిని వెళ్లి అడిగితే వారిక్కూడా ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవటం... ఇలాంటి సమస్యలు తక్కువేమీ కాదు.
ఉదాహరణకు ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేసుకున్నవారికి తొలుత చూసే హక్కులు (వ్యూయింగ్ రైట్స్) మాత్రమే వస్తాయి. అంటే వీరు ఖాతాను నెట్లో తెరిచి చూసుకోవటం తప్ప ఎలాంటి లావాదేవీలూ చెయ్యలేరు. ఇంటర్నెట్లోనే యాక్సెస్ స్థాయిని అప్‌గ్రేడ్ చేసుకుంటే... అప్పుడు లావాదేవీలు జరిపే హక్కులొస్తాయి.
కానీ కొన్ని సందర్భాల్లో ఈ రిక్వెస్ట్ పెట్టుకుని నాలుగైదు రోజులైనా అది అప్‌గ్రేడ్ కాదు. బ్యాంకుకెళ్లి అడిగితే వారు నెట్ లాగిన్‌ను చెక్‌చేసి... స్టేటస్ చెప్పటం తప్ప ఏమీ చెయ్యలేరు. కొందరు సిబ్బందికీ దీనిపై అవగాహన తక్కువే. కాకపోతే ఈ విషయంలో ప్రయివేటు బ్యాంకులు ముందంజలోనే ఉన్నాయని చెప్పొచ్చు. వాటి ఇంటర్నెట్ బ్యాంకింగే దాదాపు 90 శాతం అవసరాలను తీర్చేస్తోంది. అదీ కథ.
Comments
Please login to add a commentAdd a comment