
ఇక అందరికీ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్!
కంటెంట్, యాప్ డెవలపర్లందరికీ సేవలు అందిస్తామన్న ఫేస్‌బుక్...
⇒ కొన్ని నిబంధనలు పాటించాలని షరతు..
న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా భారీయెత్తున ఆందోళనలు చెలరేగడంతో సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ కూడా ఒక మెట్టుదిగింది. తమ ఉచిత ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌ను కంటెంట్, అప్లికేషన్ డెవలపర్లందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయితే, దీనికి కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్ డేనియల్స్ పేర్కొన్నారు.
ప్రధానంగా సంబంధిత కంటెంట్ అంతా ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లు రెండింటిలోనూ పరిమిత బ్యాండ్‌విడ్త్‌లో కూడా బ్రౌజ్ చేసేవిధంగా ఉండాలని ఆయన చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్)తో ఒప్పందం ద్వారా ఇంటర్నెట్‌డాట్ ఆర్గ్.. ఫేస్‌బుక్ ఇతరత్రా 33 వరకూ వెబ్‌సైట్లను ఎలాంటి డేటా చార్జీలూ లేకుండా యూజర్లు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇలాంటిదే ఎయిర్‌టెల్ జీరో పేరుతో ఒక స్కీమ్‌ను మొదలుపెట్టింది.
టెలికం కంపెనీలు ఇలా కొన్ని వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే ఉచితంగా అందించడంవల్ల చిన్న డెవలపర్లు, ఇతర కంటెంట్ ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని.. ఇది నెట్ సమానత్వానికి(న్యూట్రాలిటీ) దెబ్బ అంటూ నిరసనలు వెల్లువెత్తడంతో పాటు విస్తృత చర్చకు కూడా దారితీసింది. దీంతో క్లియర్‌ట్రిప్, ఎన్‌డీటీవీ వంటివి ఆర్‌కామ్ ప్లాట్‌ఫామ్ నుంచి వైదొలగగా.. ఫ్లిప్‌కార్ట్ ఇతరత్రా సంస్థలు ఎయిర్‌టెల్ జీరోకు గుడ్‌బై చెప్పాయి. అయితే, ప్రపంచంలో ఆన్‌లైన్ సేవలను అందరికీ చేరువచేయాలంటే... నెట్‌న్యూట్రాలిటీ ఎంతముఖ్యమో ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ వంటి ప్రోగ్రామ్‌లు కూడా చాలా అవసరమని డేయియల్స్ పేర్కొన్నారు. ఇప్పుడు తమ ప్లాట్‌ఫామ్‌ను టెలికం ఆపరేటర్లు, డెవలపర్లు అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల సేవలను మరింత విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు.
ట్రాయ్ మెయిల్స్‌లో పెళ్లి ఆల్బమ్‌లు!
నెట్ న్యూట్రాలిటీపై వివిధ వర్గాల నుంచి ట్రాయ్‌కు వచ్చిన ఈ-మెయిల్స్‌లో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇందులో సాఫ్ట్‌వేర్ కంపెనీల ఇంటర్నల్ మెయిల్స్‌తో పాటు ప్రైవేటు పెళ్లి ఆల్బమ్‌లు ఇతరత్రా వ్యక్తిగత అంశాలు కూడా ఉండటం విశేషం. నెట్ న్యూట్రాలిటీ, ఓవర్‌దిటాప్ ఆపరేటర్ల(వాట్స్‌యాప్, స్కైప్ వంటివి) సేవలపై మార్గదర్శకాలకు సంబంధించి నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై గత నెల 24 వరకూ ప్రజల అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అయితే, తమ అధికారిక మెయిల్ ఐడీకి సుమారు 10 లక్షల మెయిల్స్ రాగా.. వీటన్నింటినీ యథాతథంగా ట్రాయ్ బయటపెట్టింది.
అంతా ఉచితంగా ఇవ్వలేం: జుకర్‌బర్గ్
ఇంటర్నెట్‌లో మొత్తం సేవలన్నింటినీ ఉచితంగా అందించడం సాధ్యం కాదని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. అయితే, ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ద్వారా విద్య, వికీపీడియా, జాబ్ లిస్టింగ్స్, ఎయిడ్స్‌పై అవగాహన ఇతరత్రా ప్రాథమిక సేవలకు సంబంధించిన వెబ్‌సైట్లను ఎలాంటి చార్జీలూ లేకుండా అందించవచ్చన్నారు. కంటెంట్, అప్లికేషన్ డెవలపర్లు అందరికీ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ఫ్లాట్‌ఫామ్‌ను కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించిన నేపథ్యంలో జుకర్‌బర్గ్ ఒక వీడియో బ్లాగ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు బేసిక్ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందినప్పుడు.. ఇతర విస్తృత సేవలకుగాను కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని.. దీనివల్ల టెలికం ఆపరేటర్లు ఉచిత సేవలను ఆఫర్ చేసేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌లో పాలుపంచుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా ఆహ్వానిస్తామని.. తాము ఎవరికీ పైసా చెల్లించబోమని, అదేవిధంగా ఎవరినుంచీ పైసా తీసుకోబోమని తేల్చిచెప్పారు.