సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఈ ఏడాది చేసిన మార్పుల్లో ఒకటి సాధారణంగా ఇచ్చే లైక్ లకు ఎమోషన్స్ ను యాడ్ చేయడం.
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఈ ఏడాది చేసిన మార్పుల్లో ఒకటి సాధారణంగా ఇచ్చే లైక్ లకు ఎమోషన్స్ ను యాడ్ చేయడం. ఈ ఆప్షన్లు యూజర్లను పెద్దగా ఆకట్టుకోలేపోయాయని ఈ విషయంలో ఫేస్ బుక్ ఫెయిలయ్యిందని.. సోషల్ మీడియా పరిశోధనా సంస్థ 'క్వింట్లీ' తెలిపింది. ఇప్పటివరకు రియాక్షన్ లైక్ లను వాడిన వినియోగదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని సంస్థ ప్రకటించింది.
ఒక లక్షా ముప్ఫైవేల పోస్టులను పరిశోధించిన క్వింట్లీ.. వినియోగదారులు పోస్టులపై తమ ఒపీనియన్ ను తెలిపెందుకు ఆసక్తి చూపడంలేదని కనుగొంది. పోస్టులను చూసిన వెంటనే లైక్ కొట్టి కిందకు వెళ్లి పోతున్నారని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫేస్ బుక్ సాడ్, వావ్, యాంగ్రీ, లవ్, హహా, థ్యాంక్ ఫుల్ రియాక్షన్ బటన్లను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొత్తం మీద 97 శాతం పోస్టులకు లైక్ లు, కామెంట్లు, షేర్లు మాత్రమే వచ్చాయని పరిశోధనలో తేలింది. ఫోటోల కన్నా వీడియోలు ఎక్కువగా రియాక్షన్ బటన్ లైక్ లను పొందినట్లు వివరించింది.