ఎఫ్‌ఐఐల రాకకు ఇక బ్రేక్! | FII inflows to halve to $20 bn in 2015: Credit Suisse | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఐల రాకకు ఇక బ్రేక్!

Published Thu, Dec 11 2014 1:23 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఎఫ్‌ఐఐల రాకకు ఇక బ్రేక్! - Sakshi

ఎఫ్‌ఐఐల రాకకు ఇక బ్రేక్!

చమురు ధరల పతనమే కారణం: క్రెడిట్ సూసీ

ముంబై: వచ్చే ఏడాది(2015)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు సగానికి పడిపోనున్నాయని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం క్రెడిట్ సూసీ తాజాగా అంచనా వేసింది. వెరసి 2015లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు మించకపోవచ్చునని కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ ఎండీ నీలకాంత్ మిశ్రా పేర్కొన్నారు. ఇందుకు సావరిన్ వెల్త్ ఫండ్స్(ఎస్‌డబ్ల్యూఎఫ్) పెట్టుబడులు మందగించడం కారణంగా నివలనున్నట్లు చెప్పారు.

ప్రస్తుత ఏడాది(2014) జనవరి నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన నిధుల్లో ఇవి సగంకావడం గమనార్హం. దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌లో భాగమైన బ్లూచిప్ షేర్లలో ఎఫ్‌ఐఐలు ఇప్పటికే 27% వాటాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్ విలువ ఇటీవలే 1.6 ట్రిలియన్ డాలర్లను తాకి కొత్త రికార్డు సృష్టించింది కూడా.

దీంతో పలు బ్రోకరేజీ దిగ్గజాలు వచ్చే ఏడాదికి సెన్సెక్స్ లక్ష్యాన్ని 33,000 పాయింట్లుగా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ సూసీ తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ముడిచమురు ధరలు భారీగా పతనంకావడంతో ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు నిధుల కొరత ఏర్పడనుందని, దీంతో వీటి పెట్టుబడులకు బ్రేక్‌పడే అవకాశముందని మిశ్రా అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యం, యూఏఈ, ఒమన్ వంటి దేశాలలో ఎస్‌డ బ్ల్యూఎఫ్‌లు అధికమని వెల్లడించారు. దేశీ ఈక్విటీలలో ఎస్‌డబ్ల్యూఎఫ్ నిధుల వాటా 50% వరకూ ఉంటుందని వివరించారు. కాగా, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తికనబరుస్తున్నట్లు తెలిపారు. అయితే పెట్టుబడులకు ముందు భారీ స్థాయిలో రీసెర్చ్‌ను చేపడతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement