కొలిక్కి రాని జీఎస్టీ చర్చలు
కోలకతా: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి రాష్ట్రాల ఆర్థికమంత్రులతో మంగళవారం జరిగిన భేటీ లో మరోసారి నిరాశ తప్పలేదు. వివాదస్పద బిల్లుపై ఏకాభిప్రాయం సాధనకు తంటాలు పడుతున్న జైట్లీ ఇవాల్టి సమావేశంలో కూడా ఏకాభిప్రాయాన్ని సాధించ లేకపోయారు. జీఎస్టీ బిల్లు కు రాష్ట్రాల ఏకాభిప్రాయ సాధనలో భాగంగా 22రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఏడు రాష్ట్రాల ప్రతినిధులతో జైట్లీ సమావేశమయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ సమావేశంలో ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్‌టీపై చర్చించారు. అన్ని రాష్ట్రాలు వాస్తవంగా జిఎస్టీ బిల్లును బలపరిచాయనీ, తమిళనాడు రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని జైట్లీ అన్నారు. రాజ్యంగ సవరణలతోపాటుగా రాష్ట్రాల మౌలిక మద్దతు కూడా అవసరమన్నారు. మరికొన్ని పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మళ్లీ భేటీ కానున్నట్టు జైట్లీ ప్రకటించారు.
మీడియాతో మాట్లాడిన జైట్లీ జీఎస్ టీ బిల్లు ఆమోదంపై ఆశావహ దృక్పథంతో ముందుకుపోతామని ఏప్రిల్ 1 గడువుపై ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య విరోధం, హాని కలిగించని రీతిలో రూపొందించేందుకు వీలుగా నిపుణులతో చర్చిస్తామన్నారు. ఇది వచ్చే ఆర్థిక మంత్రుల సమావేశానికి దోహదపడుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య శాంతియుతంగా , స్పష్టమైన విధానం రూపొందాలని జైట్లీ నొక్కి చెప్పారు.
వస్తు సేవల బిల్లు(జీఎస్‌టీ)కు తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్‌టీకి తమిళనాడు మద్దతు తెలపకుండా కొన్ని రిజర్వేషన్లు కావాలని పట్టుబడుతోందని చెప్పారు. ఆ అంశాల్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పటికే లోక్ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. వర్షాకాల సమావేశాల్లో ఎగువ సభలోనూ ఈ బిల్లును పాస్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
మరోవైపు సాధికారిక కమిటీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి,మిత్ మిత్రా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో కమిటీ సభ్యులు హాజరయ్యారని అమిత్ మిత్రా అన్నారు. మంత్రుల బాధ్యతాయుత పనితీరును కొనియాడారు. మళ్లీ ఈ సమావేశం జులై రెండో వారంలో ఉండొచ్చని అమిత్ తెలిపారు. 1947 స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఉన్న పాత పన్ను విధానాల్లో సంస్కరణల కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు.