టీ20లోనూ ఆర్థిక సూత్రాలు | Financial principles in t20 | Sakshi
Sakshi News home page

టీ20లోనూ ఆర్థిక సూత్రాలు

Published Mon, May 14 2018 12:53 AM | Last Updated on Mon, May 14 2018 12:53 AM

Financial principles in t20 - Sakshi

ఏటా ఐపీఎల్‌ కోట్లాది మంది క్రికెట్‌ ప్రియులకు ఎంతో వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అటువంటిది. అయితే, టి20 మ్యాచ్‌లు వినోదంతోపాటు, రంగరించిన ఆర్థిక సూత్రాలను కూడా తెలియజేస్తాయి. ఆటలో భాగంగా అనుసరించే ఎన్నో విధానాలను పెట్టుబడులకు అన్వయించడం ద్వారా నిర్ణీత కాలంలో లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే మనీ మ్యాచ్‌లో విజయం సాధించడం సులభమే.


ఆరంభం నుంచే...
టి20 మ్యాచ్‌లో తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ చివరి బంతి వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించడం ద్వారానే పెద్ద స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇదే సూత్రం పెట్టుబడులకు వర్తిస్తుంది. జీవితంలో ఆర్జన మొదలైన తర్వాత సాధ్యమైనంత తొందరగా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించాలి. దానివల్ల దీర్ఘకాలంలో ఎన్నో రెట్లు ప్రతిఫలాలు అందుకోవచ్చు. రిటైర్మెంట్‌ నాటికి పెద్ద నిధి సమకూరుతుంది.  

పిచ్‌ పరిశీలన (గ్రౌండ్‌ చెకింగ్‌)..
ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు టాస్‌ వేసే ముందు మైదానంలోని పిచ్‌ను పరిశీలించడం తెలిసిందే. దీని ద్వారా పిచ్‌ పరిస్థితి ఎలా ఉంది, టాస్‌ గెలిస్తే, ఓడితే ఏది ఎంచుకోవాలన్న అంచనాకు రాగలరు. ఇదే మాదిరిగా పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు మార్కెట్‌ పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా ఏవి కొనుగోలు చేయాలి, ఏవి విక్రయించాలన్నది తెలుసుకోవచ్చు.

లక్ష్యానికి కట్టుబడి ఉండటం
ఆటలో ఎన్ని అవరోధాలు ఎదురైనా జట్టు సభ్యుల పోరాటం చివరి బంతి వరకూ కొనసాగాల్సిందే. ఒకటి రెండు బంతులు, ఓవర్లు ఫలితాలను తారు మారు చేయగలవు. అలాగే, పెట్టుబడులకు సంబంధించి కూడా మార్కెట్లలో ఆటుపోట్లు, కరెక్షన్లకు భయపడిపోకుండా లక్ష్యం మేరకు పెట్టుబడులను కొనసాగిస్తూ వెళ్లాలి. అప్పుడే అనుకున్న మేర సంపద సృష్టి సాధ్యమవుతుంది.

ప్రణాళిక
ప్రతీ మ్యాచ్‌లో మధ్యలో కాస్తంత విరామం ఉంటుంది. ఆ సమయంలో జట్లు తమ వ్యూహంపై చర్చించుకోవడం జరుగుతుంది. మిగిలి ఉన్న ఆట సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇందులో నిర్ణయం తీసుకుంటారు. అలాగే, పెట్టుబడి పెట్టే ముందు కూడా ఆర్థిక సలహాదారునితో ఓ సారి చర్చించి తగిన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో అవసరం.  

రిస్క్‌తోనే రాబడులు
ఆటలో ప్రతీ బంతిని డిఫెన్స్‌తో ఆడితే కుదరదు. మధ్య మధ్యలో వీలునుబట్టి సిక్సర్, ఫోర్‌ కొట్టడం ద్వారానే అధిక స్కోరు సాధ్యమవుతుంది. అలాగే, పెట్టుబడులకు సంబంధించి కొంత మేర రిస్క్‌ ఉన్నాగానీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. దాంతో అధిక రాబడులు ఆర్జించొచ్చు. మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు పెట్టుబడుల ద్వారా లక్ష్యాలను సులభంగా చేసుకోవచ్చు.

వైవిధ్యం ..
టి20 మ్యాచ్‌లో పెద్ద స్కోరు సాధించాలన్నా, ప్రత్యర్థి జట్టును అధిక స్కోరు చేయకుండా కట్టడి చేసి విజయం సాధించాలన్నా అందుకు జట్టులో సమన్వయంతోపాటు వైవిధ్యం ఉండాలి. మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు, వికెట్‌ కీపర్‌ ఇలా అందరితోనే చక్కని జట్టు సమకూరుతుంది. అప్పుడే లక్ష్య సాధన సులభమవుతుంది.

అలాగే, పెట్టుబడుల్లోనూ వైవిధ్యం అవసరం. భిన్న రకాల సాధనాలను ఎంచుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఇలా అన్నింటి మిశ్రమం ఉండాలి. ఈక్విటీలు మాత్రమేకాదు, డెట్‌లో కొంత, బంగారం, రియల్టీల్లోనూ పెట్టుబడులను వర్గీకరించుకోవడం వల్ల రిస్క్‌ తగ్గించుకుని మెరుగైన రాబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.  

స్థిరత్వం...
క్రికెట్‌ ఆట కొనసాగుతున్నంత సేపు స్టేడియంలో వీక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. వీక్షకుల కామెంట్లను పాజిటివ్‌గా తీసుకుంటే ఆటగాళ్లు మరింత మెరుగ్గా ఆడగలరు. అనుభవం కలిగిన ఆటగాళ్లు వీటిని పట్టించుకోకుండా ఆటపై, లక్ష్యంపైనే దృష్టి సారిస్తుంటారు.

అలాగే, ఓ ఇన్వెస్టర్‌గా మార్కెట్ల ర్యాలీలు, కరెక్షన్‌ సమయాల్లో ప్రతికూల వార్తలకు కలత చెందకూడదు. అవి ఆయా సమయాల్లో స్వల్పకాలం పాటు వినిపించేవి మాత్రమే. వీటిని పట్టించుకోకుండా ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.


వ్యూహాలు
బౌలర్‌ అయినా, బ్యాట్స్‌మన్‌ అయినా ఇతరుల స్ట్రాటజీ ఏంటన్నది తెలుసుకోవడం అవసరం. అప్పుడే వారు తమ లక్ష్య సాధనకు పదును పెట్టగలరు. పెట్టుబడులకు దీన్ని అన్వయించి చూస్తే.. తగిన పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల విధానాలను తెలుసుకునేందుకు మంచి ఆర్థిక సలహాదారు ఎంపిక అన్నది కీలకం. ఆటకు మాదిరే పెట్టుబడులకూ వ్యూహం ఉండాలి. అప్పుడే వాటిపై ప్రతిఫలాన్ని పొందగలరు.  

పనితీరు విశ్లేషణ
ప్రతీ ఆటగాడికి సంబంధించి జట్టు కెప్టెన్‌ విశ్లేషణ చేయడం సహజం. అప్పుడే జట్టులో మార్పు, చేర్పుల ద్వారా మంచి సమతూకంతో కూడిన జట్టు నిర్మాణం సాధ్యమవుతుంది. రాణించలేకపోతున్న వారిని తప్పించడం, ప్రతిభ కలిగిన వారికి అవకాశం ఇవ్వడం, పిచ్‌ తగ్గట్టుగా జట్టులో మార్పులు చేయడం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి.

అలాగే, మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం అదే పనిగా నష్టాల్లోనే ప్రయాణిస్తుంటే, రాబడులను ఇవ్వలేకపోతుంటే ఆ పథకం నుంచి వైదొలగడం చేయాల్సి ఉంటుంది. మరో మంచి పథకాన్ని పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement