సాక్షి, న్యూఢిల్లీ: జర‍్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్‌కు చెందిన మరో సంస్థ ఆడికు దేశంలో తొలి ఎదురు దెబ్బతగిలింది. ఉద్గార నిబంధనలకు సంబంధించిన ఆరోపణలతో దేశంలో తొలిసారిగా కేసు నమోదైంది. నోయిడా నివాసి ఒకరు కంపెనీపైనా, కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులపైనా తాజాగా ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర లాంటి ఆరోపణలతో సంస్థపై కేసు నమోదైంది. (ఆడి కొత్తకారు వచ్చేసింది)
కాలుష్య నివారణకు సంబంధించి, ఉద్గారాల శాతాన్ని తక్కువగా చూపించే మోసపూరిత పరికరాలతో తనను మోసం చేశారని ఆరోపిస్తూ అనిల్ జిత్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులతోపాటు, జర్మనీలోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల పైనా కూడా ఆయన కేసు పెట్టారు. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ రాహిల్ అన్సారీ, ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఏజీ చైర్మన్ బ్రామ్ షాట్ పేర్లను ఎఫ్‌ఐఆర్ లో చేర్చారు. 2018లో కోట్ల రూపాయల విలువైన ఏడు ఆడి కార్లను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. డెలివరీ సమయంలో, భారతదేశంలో చీట్ డివైసెస్ గురించి తాను విచారించానని, అయితే అలాంటి దేమీ లేదని చెప్పి తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలు అనుమతించిన పరిమితుల కంటే ఆడికార్లలో 5-8 రెట్లు ఉన్నాయని తేలడంతో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఫోక్స్ వ్యాగన్‌పై 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో తాను మేల్కొన్నాని పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ పరికరాలతో ఉద్దేశ పూర్వకంగానే ఈ కంపెనీలు తనను మోసం చేశాయని, తన కష్టార్జితాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాల్సింగా సింగ్ డిమాండ్ చేశారు.
కాగా ఫోక్స్ వ్యాగన్ గ్లోబల్ ఉద్గార నిబంధనల ఉల్లంఘన కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో దేశంలో తాజా కేసు నమోదు కావడం గమనార్హం. పరిమితికి మించి 10-40 రెట్లు ఉద్గారాలను ఉత్పత్తి చేసే పరికరాలను కార్లలో అమర్చుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్‌లో విడుదల చేసిన డీజిల్ కార్లలో ‘చీట్ డివైజ్’ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష‍్టం వాటిల్లిందంటూ ఎన్‌జీటీ గత ఏడాది మార్చిలో ఫోక్స్ వ్యాగన్‌కు 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment