లాభదాయక పీఎస్‌యూల్లో వాటా విక్రయంపై దృష్టి
ఐపీఓ ప్రణాళికలు ఇవ్వాల్సిందిగా కంపెనీలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: లాభాల్లో ఉన్న అన్‌లిస్టెడ్ ప్రభుత్వ రంగ కంపెనీలు(పీఎస్‌యూ), వాటి అనుబంధ సంస్థల్లో వాటా విక్రయాలపై కేంద్రం దృష్టిసారించింది. వార్షిక పనితీరు నివేదికలతో పాటు పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) ప్రణాళికలను కూడా సమర్పించాల్సిందిగా ఆయా కంపెనీలకు సూచించింది. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ(డీపీఈ)కు ఇటీవలే ఆర్థిక శాఖ ఈ మేరకు సమాచారం పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
దాదాపు 160 లాభదాయక కేంద్ర పీఎస్‌యూల్లో కేవలం 43 మాత్రమే ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. లాభాల్లో ఉండి లిస్టింగ్‌కాని జాబితాలో వైజాగ్ స్టీల్(ఆర్‌ఐఎన్‌ఎల్), ఓఎన్‌జీసీ విదేశ్, కోల్ ఇండియా అనుబంధ సంస్థలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రధానంగా ఉన్నాయి. దీంతో పీఎస్‌యూలతో వార్షిక పనితీరుపై ఎంఓయూల్లో లిస్టింగ్ ప్రణాళికలను ఇకపై తప్పనిసరి చేయాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం డీపీఈకి స్పష్టం చేసింది. గడిచిన ఐదేళ్లుగా కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈ ఏడాది(2015-16) పీఎస్‌యూల్లో వాటా అమ్మకాల ద్వారా రూ.69,500 కోట్లను సమీకరించాలనేది కేంద్రం లక్ష్యం.