జీఎస్టీ: బంగారం బతికిపోయింది
బులియన్ మార్కెట్ వర్గాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొంత ఊరటనిచ్చారు. బంగారంపై భారీమొత్తంలో పన్ను రేట్లను కాకుండా.. 3 శాతం రేటును మాత్రమే విధించనున్నట్టు పేర్కొన్నారు. జీఎస్టీ పన్ను శ్లాబుల్లో కొత్తగా ఈ శ్లాబును చేర్చుతూ బంగారాన్ని దీన్ని పరిధిలోకి తీసుకొచ్చారు..బంగారంతో పాటు, బంగారం ఆభరణాలు, డైమండ్లపై కూడా 3 శాతం జీఎస్టీనే విధించాలని ఆర్థిక మంత్రి నేతృత్వంలో నేడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ రేటు పరిశ్రమ వర్గాల అంచనాల మేరకే వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం బంగారంపై సుమారు 2 శాతం పన్ను వసూలుచేస్తున్నారు. కొన్నిరాష్ట్రాల్లో వ్యాట్ ఎక్కువగా ఉండటంతో పన్ను రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.
గతనెలలో జరిగిన జీఎస్టీ మండలి భేటీలో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబులను నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతాలను జీఎస్టీ శ్లాబులుగా నిర్ణయించారు. అయితే వీటిలో అతితక్కువ రేటు 5 శాతం పరిధిలోకి లేదా 2 శాతంలోకి తీసుకురావాలని ప్రతిపాదనలు వచ్చాయి. వారి ప్రతిపాదనలతో పాటు మధ్యతరగతి వర్గాలు బంగారంపై ఎక్కువగా సేవింగ్స్ చేసే అవకాశాలున్న కారణంతో బంగారంపై జీఎస్టీ రేటును తక్కువగా 3శాతంగా నిర్ణయించారు. అంతేకాక తక్కువ రేట్లతో అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయొచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
పన్నుల భారం ఎక్కువగా ఉంటే, పన్నులు ఎగవేయాలనే ఆలోచలను పెరిగి స్మగ్లింగ్ కు దారితీస్తుందని ఆర్థికమంత్రిత్వశాఖకు అంతకముందే బులియన్ మార్కెట్ వర్గాలు విన్నపించుకున్నాయి. బులియన్ మార్కెట్ దారుల విన్నపం మేరకు ప్రభుత్వం కూడా బంగారంపై తక్కువగానే రేట్లను ఉంచింది. బంగారంపై నేడు విధించిన 3 శాతం జీఎస్టీని స్వాగతించదగినదేనని టైటాన్ సీఎఫ్ఓ సుబ్రహ్మణ్యమ్ అన్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు జెమ్స్ అండ్ జువెల్లరీ పరిశ్రమ సన్నద్దంగా ఉందని పేర్కొన్నారు. 3 శాతం రేటు బంగారం డిమాండ్ ను దెబ్బతీస్తుందని అనుకోవడం లేదని, వినియోగదారులకు ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతమున్న రేటుకు జీఎస్టీ రేటుకు పెద్దగా తేడా లేదని, అంగీకరించే విధంగానే ఉందని బులియన్ వర్గాలు చెప్పాయి.