ఫోర్బ్స్ కుబేరుల్లో మళ్లీ ముకేశ్ టాప్
సంపన్న భారతీయుల్లో వరుసగా తొమ్మిదోసారి నంబర్‌వన్
- టాప్ 100లో నలుగురే మహిళలు
- మొత్తం సంపన్నుల సంపద
- 345 బిలియన్ డాలర్లు
సింగపూర్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి భారత్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. 18.9 బిలియన్ డాలర్ల సంపదతో నంబర్‌వన్‌గా నిల్చారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది భారత కుబేరుల జాబితాలో 18 బిలియన్ డాలర్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో, 15.9 బిలియన్ డాలర్లతో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిల్చారు. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ 2.9 బిలియన్ డాలర్లతో 29వ స్థానంలో ఉన్నారు. జాబితాలోని 10 మంది సంపన్నుల సంపద ఒక్కొక్కరిది ఏడాది వ్యవధిలో బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది.
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఫోర్బ్స్.. స్టాక్ మార్కెట్లు గతేడాదితో పోలిస్తే 5 శాతం క్షీణించాయని, రూపాయి 9 శాతం మేర పతనమైందని పేర్కొంది. ఇలాంటి పరిణామాల నడుమ సంపన్నుల సంపద పెద్దగా పెరగలేదని తెలిపింది. టాప్ 100 కుబేరుల సంపద ఈసారి కూడా దాదాపు గతేడాది స్థాయిలోనే 345 బిలియన్ డాలర్ల మేర ఉందని ఫోర్బ్స్ వివరించింది.
మహిళల్లో సావిత్రి జిందాల్ టాప్ ..
టాప్ 100 సంపన్నుల్లో కేవలం నలుగురు మహిళలే ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ (23వ ర్యాంకు)లో నిలిచారు. యూఎస్‌వీ ఫార్మా చైర్‌పర్సన్ లీనా తివారీ (54 ర్యాంకు) , హావెల్స్ వ్యవస్థాపకుడు కీమత్ రాయ్ గుప్తా సతీమణి వినోద్ గుప్తా (74వ ర్యాంకు), బెనెట్..కోల్‌మన్‌కి చెందిన ఇందు జైన్ (57వ ర్యాంకు) ఈ జాబితాలో ఉన్నారు. వీరందరి సంపద 9.2 బిలియన్ డాలర్లు. మహిళల్లో 3.8 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్ టాప్‌లో ఉన్నారు.
లిస్టులో 12 కొత్త ముఖాలు..
ఈసారి జాబితాలో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు, ఇండిగో ఎయిర్‌లైన్ సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ సహా 12 మంది సంపన్నులు కొత్తగా చేరారు. టీకాల తయారీ సంస్థ సీరమ్ అధినేత సైరస్ పూనావాలా సంపద అందరికన్నా అత్యధికంగా పెరిగింది. 6.2 బిలియన్ డాలర్ల నుంచి 7.9 బిలియన్ డాలర్లకు చేరింది. కనీసం 1.1 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారు ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్నారు.
జాబితాలో తెలుగు దిగ్గజాలు..
తెలుగువారిలో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి 2.8 బిలియన్ డాలర్ల సంపదతో 30వ స్థానంలోఉండగా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుల కుటుంబం 2.6 బిలియన్ డాలర్లతో 33వ స్థానంలో నిల్చింది. దివీస్ ల్యాబ్స్ చైర్మన్ మురళీ దివి 2.3 బిలియన్ డాలర్లతో 42వ స్థానంలో ఉన్నారు.