న్యూఢిల్లీ/న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ఈ సంవత్సరానికి గాను విడుదల చేసిన ప్రపంచపు వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె ఈ స్థానాన్ని దక్కించుకోవటం ఇది 12వ సారి. అంతేకాక... మధ్యలో ఎక్కడా మిస్ కాకుండా ఏడేళ్లుగా వరసగా మెర్కెల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
మన దేశం నుంచి చూస్తే ఐదుగురు మహిళలకు ఈ జాబితాలో స్థానం దక్కింది. వీరిలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే ఈమె 32వ స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ కార్ప్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా 57వ స్థానాన్ని, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా 71వ స్థానాన్ని దక్కించుకున్నారు.
హిందుస్తాన్ టైమ్స్‌ను ప్రచురించే హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్, ఎడిటోరియల్ డైరెక్టర్ శోభన భర్తియా 92వ స్థానంలో నిలవగా... హాలీవుడ్ కూడా వెళ్లిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 97వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన పెప్సికో సీఈవో ఇంద్రా నూయి 11వ స్థానంలో నిలిచారు. ఇండో–అమెరికన్ నిక్కీ హేలీ 43వ స్థానంలో ఉన్నారు.
టాప్‌లో థెరెసా మే, మిలిందా గేట్స్
ఫోర్బ్స్ ప్రపంచపు వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఏంజెలా మెర్కెల్ తరవాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా యూకే ప్రధాని థెరెసా మే, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ నిలిచారు.
ఇక ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 4వ స్థానంలో, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా ఐదో స్థానంలో నిలిచారు. జాబితాలోకి కొత్తగా 23 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇవాంకా ట్రంప్ కూడా(19వ స్థానం) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment