అమెజాన్ ఉచిత వైఫై జోన్లు
హైదరాబాద్‌తోసహా మూడు నగరాల్లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినూత్న ఆలోచనతో తొలిసారిగా రంగంలోకి దిగింది. హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో ఉచిత వైఫై జోన్లను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటంకం లేకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకునేందుకు వీలుగా కస్టమర్ల సౌకర్యార్థం ఈ చొరవ తీసుకున్నట్టు కంపెనీ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ మనీష్ కల్రా వెల్లడించారు. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ బస్ కూడలి, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేటల్లో వైఫై జోన్లు ఏర్పాటయ్యాయి.
ఈ ప్రాంతాల్లో వినియోగదార్లకు సహకారం అందించేందుకు కంపెనీ సిబ్బంది ఉంటారు. జూలై 14న ప్రారంభమైన ఈ సేవలు 20 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. కంపెనీ లక్ష్యం నెరవేరితే ఈ సేవలు మరి కొంతకాలం కొనసాగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత్‌లో 2 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు గతేడాది అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌తో కంపెనీకి తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పుడు ఉచిత వైఫై జోన్లతో కస్టమర్లను ఆకట్టుకుని అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీకి వీలవుతుంది. అమెజాన్ బ్రాండ్‌కు కూడా మరింత ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉంది.