కేసు వెనక్కి తీసుకుంటేనే గ్యాస్ రేటుపై స్వేచ్ఛ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మెలిక
న్యూఢిల్లీ: కఠిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటుపై కంపెనీలకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)కు మాత్రం తక్షణ ప్రయోజనం లభించకపోవచ్చు. న్యాయవివాదాల్లో చిక్కుకున్న క్షేత్రాలకు కొత్త ఫార్ములా వర్తించకపోవడమే దీనికి కారణం. చమురు శాఖ అదనపు కార్యదర్శి యూపీ సింగ్ .. క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతంలో గ్యాస్ రేటు విషయంలో ఆర్‌ఐఎల్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా లేనందున వ్యయాలను రికవర్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపైనా ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. ఈ దరిమిలా తాజా ధర ఫార్ములా ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్యాస్ రేటుపై స్వేచ్ఛ ప్రయోజనాలు లభించాలంటే ధర విషయంలో వేసిన పిటీషన్‌ని వెనక్కి తీసుకుంటే సరిపోతుందని, అన్ని ఆర్బిట్రేషన్‌లను ఉపసంహరించుకోనక్కర్లేదని చమురు శాఖ వర్గాలు తెలిపాయి.