
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహోపకరణాల రంగంలో దేశంలో 2020 నాటికి మూడో స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు గోద్రెజ్ వెల్లడించింది. ప్రస్తుతం 11–12 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నట్టు గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలియజేశారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా వినూత్న ఆవిష్కరణలపై ఫోకస్ చేశామన్నారు. ఇందుకు పరిశోధనపై భారీగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. గతేడాది కంపెనీ టర్నోవర్ రూ.3,300 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. అలెర్జీ ప్రొటెక్ట్ ఫీచర్‌తో గోద్రెజ్ ఇయాన్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను బుధవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అలెర్జీ కారక క్రిములు, బ్యాక్టీరియాను ఈ వాషింగ్ మెషీన్ దూరం చేస్తుందని వివరించారు.
నవంబరులో కొత్త ధరలు..
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాల ధరలు నవంబరు నుంచి 3–4 శాతం పెరిగే చాన్స్ ఉందని కమల్ నంది వెల్లడించారు. స్టీల్, కాపర్ తదితర ముడి సరుకుల వ్యయాలు ప్రియం కావడమే ఇందుకు కారణమన్నారు. ఇక దేశవ్యాప్తంగా గృహోపకరణాల పరిశ్రమ వృద్ధి రేటు 2016లో 15 శాతం నమోదైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కారణంగా వృద్ధి 2017 జనవరి–జూన్‌లో 5–7%కి పరిమితమైంది. మొత్తంగా ఈ ఏడాది వృద్ధి 10–12 శాతం ఉంటుందని అంచనాగా చెప్పారు. జీఎస్‌టీకి ముందు గృహోపకరణాల మీద పన్ను రాష్ట్రాన్నిబట్టి 23–26 శాతం ఉండేదన్నారు. జీఎస్‌టీ రాకతో ఇది 28 శాతానికి చేరిందని వివరించారు. గృహోపకరణాలను లగ్జరీగా చూడొద్దని, అవసమైన వస్తువులుగా పరిగణించి పన్ను తగ్గించాల్సిందిగా ప్రభుత్వాన్ని పరిశ్రమ కోరుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment