రెండో విడత గోల్డ్ బాండ్లతో రూ.726 కోట్లు
తొలి విడతకన్నా మూడు రెట్లు అధికం
న్యూఢిల్లీ: రెండవ విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా కేంద్రం రూ.726 కోట్లు సమీకరించింది. మొత్తం 2,790 కేజీలకు సబ్‌స్క్రిప్షన్లు రావటంతో ఈ నిధులు సమకూరినట్లు ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. మొదటి విడతలో సమీకరించిన మొత్తం కన్నా ఇది మూడు రెట్లు అధికమన్నారు. నవంబర్‌లో జారీ అయిన తొలి విడత స్కీమ్‌లో 916 కేజీలకు సంబంధించి రూ.246 కోట్లు సమీకరించటం తెలిసిందే. రెండవ దఫాలో 3.16 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు దాస్ తెలిపారు.
గత దఫా ఈ దరఖాస్తుల సంఖ్య 62,169గా ఉంది. తొలి విడతతో పోలిస్తే రెండో దఫాలో మంచి స్పందన వచ్చినట్లు దాస్ తెలిపారు. రెండవ విడత ఆఫర్ జనవరి 18న ప్రారంభమై, జనవరి 22న ముగియటం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఇందుకు సంబంధించి బాండ్లను కేటాయిస్తారు. క్రమంగా ఈ పథకాలకు ప్రజాదరణ లభిస్తున్న విషయం తాజా బాండ్ల జారీతో వెల్లడయిందని దాస్ వివరించారు.
కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి అందిన సమాచారం... ప్రాథమికమైనదేనని, మరింత సమాచారం అందాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఇష్యూకు సంబంధించి 99.9 స్వచ్ఛత ఉన్న గ్రాము ధర రూ.2,600. గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది జవనరి 11-15 తేదీల్లోని 99.9 స్వచ్ఛత బంగారం ధర సగటు ఆధారంగా బాండ్ల ధరను నిర్ణయించారు.
లక్ష్యం కష్టమే!: గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్చికి రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ కార్యక్రమంలో గోల్డ్ బాండ్ స్కీమ్ భాగంగా ఉంది. తొలి దశకన్నా రెండవ దశ కొంత మెరుగైన ఫలితం కనబడటం ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం.