మహిళలను తక్కువ చేశాడు: గూగుల్ పీకేసింది!
మహిళలను తక్కువ చేసి మాట్లాడి, లింగవివక్షకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గూగుల్ తీసేసింది. జేమ్స్ డామోర్‌ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ సోమవారం వెల్లడించింది. జేమ్స్ రాసిన ఇంటర్నల్ మెమోలో, టెక్నాలజీ ఉద్యోగాలకు మహిళల కంటే పురుషులే ఎక్కువగా, మంచిగా సరిపోతారని పేర్కొన్నారు. ఈ మెమోపై కంపెనీలో తీవ్ర చర్చనీయాంశమైంది. గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్‌లో, ఆ ఉద్యోగి కంపెనీ పాలసీని ఉల్లంఘించినట్టు తెలిపారు. అయితే తనని కంపెనీ నుంచి తొలగించడంపై జేమ్స్ కూడా గూగుల్‌కు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగాడు.
జేమ్స్ గతవారం ఈ ఇంటర్నల్ మెమోను ప్రచురించాడు. కంపెనీలో వైవిధ్యపూరితమైన వాతావరణాన్ని పెంచేందుకు గూగుల్ ప్రయత్నిస్తుందంటూ ఆయన విమర్శించాడు. అంతేకాక ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో మహిళల కంటే పురుషులే మంచిగా సరిపోతారని పేర్కొన్నాడు. దీంతో ఎగ్జిక్యూటివ్‌ల మధ్య అంతర్గతంగా పక్షపాత ధోరణి నెలకొన్నాయి. కొంతమంది ఉద్యోగులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కంపెనీలో అంతర్గతంగా ప్రచురితమైన ఈ మెమో బయటికి పొక్కడంతో, ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన గూగుల్, ఒక్కసారిగా వివాదస్పదానికి గురైంది.
దీంతో తమ వర్క్‌ప్లేస్‌లో హానికరమైన లింగవివక్షతకు పాల్పడటం, తమ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమని సుందర్ పిచాయ్ తెలిపారు. వేధింపులకు, వివక్షతకు, చట్టవిరుద్ధమైన వివక్షతలకు తావులేకుండా ప్రతి ఒక్క ఉద్యోగి సంప్రదాయ వర్క్‌ప్లేస్‌ను సృష్టించాలని కోరారు. ఇటీవల ఉబర్ టెక్నాలజీస్ సైతం లైంగిక వేధింపుల కేసులతో సతమతమైంది. ఈ స్కాండల్స్‌తో ఉబర్ సీఈవో కొన్ని రోజులు తన పదవికి రాజీనామా కూడా చేశారు. పెద్ద పెద్ద కంపెనీల్లోనే లైంగిక వేధింపులు ఎక్కువ అవుతుండటం మరింత వివాదస్పదమవుతున్నాయి.