న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ అయిన చైనా యాప్స్‌ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్‌తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్‌లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను వన్ టచ్ యాప్‌ల్యాబ్స్ రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment