మొబైల్ యూజర్లకు డబుల్ షాక్
మొబైల్ యూజర్లకు డబుల్ షాక్
Published Sat, May 20 2017 11:11 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM
కోల్ కత్తా : దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లను నిర్ణయించేసింది. బంగారంపై రేట్లపై మాత్రమే ఇక తుది నిర్ణయం రావాల్సి ఉంది. జీఎస్టీ అమలుతో ప్రతి యూజర్ చేతిలో ఒక నిత్యావసర వస్తువుగా మారిన మొబైల్ ఫోన్ల ధరలు కాకపుట్టనున్నాయట. ఒక్క మొబైల్ హ్యాండ్ సెట్లు మాత్రమేకాక, మొబైల్ ఫోన్ బిల్స్ కు మోత మోగనున్నాయని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లకు డబుల్ షాకేనని ఆందోళన వ్యక్తమవుతోంది. మొబైల్ ఇండస్ట్రీని 12 శాతం, టెలికాం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లతో వినియోగత్వం, పెట్టుబడులు తగ్గిపోతాయని మొబైల్ ఫోన్ ఇండస్ట్రి ఆందోళన వ్యక్తంచేస్తోంది.
యూజర్లు ఇక తమ నెలవారీ 1000 రూపాయల మొబైల్ బిల్లుకు అదనంగా 30 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న టెలికాం సర్వీసుల పన్ను రేట్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగడంతో ఈ మేరకు మొబైల్ ఫోన్ బిల్లులు భారీగా ఎగియనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రీపెయిడ్ యూజర్ల ఎఫెక్టివ్ టాక్ టైమ్ కూడా తగ్గిపోనుందట. జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మొబైల్ ఫోన్లు 4-5 శాతం ఖరీదుగా మారతాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి.
స్థానికంగా తయారుచేసే డివైజ్ లు కూడా మరింత ఖరీదైనవిగా మారునున్నాయట. జనవరి నుంచి మార్చి కాలంలో భారత్ లో 59 మిలియన్ల మొబైల్ ఫోన్లు అమ్ముడుపోయాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ లో తెలిసింది. 18 శాతం పన్నుపై టెలికాం ఇండస్ట్రి ఇప్పటికే పెదవి విరిచేసింది. ఇక మొబైల్ ఇండస్ట్రి నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు పెరగడంతో, స్థానిక మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ పడిపోనుందని తెలుస్తోంది.
Advertisement