లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం... | Harley Davidson Street 750 bookings to open on 1st March | Sakshi
Sakshi News home page

లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...

Published Tue, Mar 4 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...

లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లీ డేవిడ్‌సన్, ట్రయంఫ్, హ్యోసంగ్, కవాసాకి నింజా, డ్యుకాటీ... ఈ పేర్లు వినగానే లగ్జరీ బైకులని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పుడివి మగవారికి మాత్రమే సొంతం కాదండోయ్!!. ‘మేము కూడా దూసుకుపోతాం’ అంటున్నారు మహిళలు. అవును.. లగ్జరీ, సూపర్ బైకుల రైడింగ్‌పై మహిళల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. వీరి ఆసక్తి తగ్గట్టే మహిళల కోసం ప్రత్యేకమైన లగ్జరీ బైకులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి వాహన సంస్థలు. దేశవ్యాప్తంగా ఏటా 10 వేల లగ్జరీ బైకులు అమ్ముడవుతుండగా ఇందులో మహిళ వాటా 10 శాతంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

 మెట్రో నగరాల్లో మహిళల జీవన శైలి, ఆలోచన విధానాల్లో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. దీంతో మగవారితో సమానంగా వారు కూడా లగ్జరీ, సూపర్ బైకులను నడపాలని కోరుకుంటున్నారు. అయితే మనదేశంలో మహిళా బైక్ రైడింగ్ విభాగం చాలా చిన్నది. అందుకే మహిళా కస్టమర్లను ఆకర్షించడం ఇక్కడ సులువైన పని కాదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ‘‘ప్రతి నెలా లగ్జరీ బైక్స్ కొనేందుకు మా షోరూమ్‌కు వచ్చే 15 మంది కస్టమర్లలో ఇద్దరు మహిళా కస్టమర్లు ఉంటున్నారు’’ అని హార్లీ డేవిడ్‌సన్ ఏపీ డీలర్ జయ్‌రామ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన ‘స్ట్రీట్ 750’ ‘సూపర్’లో లగ్జరీ బైకులు మహిళలకు సరిగ్గా సరిపోతాయన్నారు. ‘‘ఎందుకంటే వీటి ఎత్తు, బరువు మిగతా లగ్జరీ బైకులకంటే తక్కువగా ఉంటాయి.

దీంతో నాలుగు ఫీట్లుండే మహిళలు ఈ బైకులపై కూర్చున్నా కూడా వారికి బ్రేకులు, గేర్లు అందుతాయి’’ అని వివరించారు. దేశ వ్యాప్తంగా హార్లీ డేవిడ్‌సన్ బైకులకు 2 వేల మంది మహిళా కస్టమర్లున్నారని ఆయన చెప్పారు. ‘‘లాంగ్ డ్రైవ్ కోసమే లగ్జరీ బైకులు. ఇతర బైకులు గనక 80 కి.మీ. వేగాన్ని దాటితే నియంత్రించలేం. కానీ, లగ్జరీ బైకులు 150 కి.మీ. దాటినా సులువుగా నియంత్రించొచ్చు. అందుకే హ్యోసంగ్ నుంచి 250 సీసీ క్రూజర్ బైకును ప్రత్యేకంగా మహిళల కోసమే మార్కెట్‌లోకి విడుదల చేశాం’’ అని చెప్పారు హోయోసంగ్ ఏపీ డీలర్ వంశీ కృష్ణ.

170 కిలోల బరువుండే ఈ బైకుపై ఆగకుండా వెయ్యి కి.మీ ప్రయాణించినా నడుం నొప్పి రాదని వంశీ కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే మగవారిని ఆకర్షించినంత సులువుగా మహిళా కస్టమర్లను ఆకర్షించలేమని ఆయనన్నారు. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, సమాజ కోణం వంటి ఎన్నో కారణాలున్నాయన్నారు. 250 సీసీ నుంచి 1,800 సీసీ గల లగ్జరీ, సూపర్ బైకులు దేశవ్యాప్తంగా ఏటా 10 వేలు అమ్ముడవుతుండగా... వీటిలో మహిళల వాటా 10 శాతం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లలో లగ్జరీ బైకుల కొనుగోళ్లలో మహిళల వాటా 20-30% పెరిగే అవకాశముందన్నది వారి అంచనా.

 ఎత్తు, బరువు తక్కువుంటేనే..: సాధారణంగా మహిళలు నడిపే స్కూటీ పెప్ వాహనాల పొడవు 1,735 ఎంఎం, వెడల్పు 590 ఎంఎం, సీటు ఎత్తు 740 ఎంఎం ఉంటుంది. కానీ లగ్జరీ, సూపర్ బైక్స్ భిన్నమైనవి. మహిళలు  వీటి ని నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే మహిళల కోసం లగ్జరీ బైకుల తయారీలో బండి బరువు, ఎత్తు తగ్గింపు వంటి చిన్న మా ర్పులు చేస్తున్నారు. దీంతో మగాళ్లతో సమానంగా మహిళలూ లగ్జరీ, సూపర్ బైక్స్‌పై దూసుకుపోతున్నారు.
 
 సర్వేలు శిక్షణ కూడా...
 కోట్లు వెచ్చించి తయారు చేసిన వాహనాలు తీరా మార్కెట్‌లోకి విడుదలయ్యాక మహిళలు స్వాగతించకపోతే కంపెనీలకు నష్టమే. అందుకే మహిళలు ఎలాంటి బైకులు ఇష్టపడతారో సర్వేలు చేసి మరీ విడుదల చేస్తున్నాయి. హార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు మహిళలు, మగవారు ఇద్దరిలో ఈ బైక్ ఎవరికి కరెక్ట్‌గా సరిపోతుందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేశాకే ప్రవేశపెట్టింది. బరువెక్కువగా ఉండే లగ్జరీ, సూపర్ బైకులను ఎలా నియంత్రించాలో మహిళల కోసం ప్రత్యేకమైన శిక్షణ తరగతులూ  నిర్వహిస్తున్నాయి ట్రయంఫ్ వంటి కొన్నికంపెనీలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement