ముంబై: గృహ రుణాల సంస్థ.. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్(పీఎన్‌బీహెచ్‌ఎఫ్)లో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పీఎన్‌బీహెచ్‌ఎఫ్ యాజమాన్యంతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రమోటర్లయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కార్లైల్‌లకు ఉన్న మొత్తం 66% వాటాల కొనుగోలుపై భేటీలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, దీనిపై బీఎస్‌ఈ సోమవారం వివరణ కోరగా.. పీఎన్‌బీహెచ్‌ఎఫ్ యాజమాన్యంతో సమావేశం వార్తలను హెచ్‌డీఎఫ్‌సీ ఖండించింది. హెచ్‌డీఎఫ్‌సీ గతంలో కూడా కెన్‌ఫిన్ హోమ్స్‌లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. కానీ కెన్ ఫిన్ హోమ్స్ ప్రమోటర్లు వాటాల విక్రయ యోచనను పక్కన పెట్టడంతో డీల్ కుదరలేదు. ఒకవేళ పీఎన్‌బీహెచ్‌ఎఫ్ డీల్ గానీ కుదిరితే టేకోవర్ నిబంధనల ప్రకారం మిగతా వాటాల కొనుగోలు కోసం హెచ్‌డీఎఫ్‌సీ ప్రత్యేకంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ రూ. 13,000 కోట్లు సమీకరించింది.
పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో పీఎన్‌బీ, కార్లైల్‌కి చెరి 33 శాతం వాటాలు ఉన్నాయి. వాటాల విక్రయ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల మేర ఉండొచ్చని.. ఒప్పందం కుదిరిందంటే కార్లైల్‌కి, పీఎన్‌బీకి చెరి రూ. 6,000 కోట్లు రావొచ్చని అంచనా. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో వివిధ సంస్థల్లో వాటాలను విక్రయించడంతో పాటు ఇతరత్రా వనరుల ద్వారా కూడా నిధులు సమీకరించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సంస్కరణలను అమలు చేసే దిశగా పీఎన్‌బీహెచ్, ఇక్రా, క్రిసిల్, బీఎస్‌ఈ వంటి సంస్థల్లో తగు సమయంలో తమ వాటాలను విక్రయించనున్నట్లు పీఎన్‌బీ ఇటీవలే స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.
అడ్వైజర్ల నియామకంలో ప్రమోటర్లు..
కార్లైల్ ఇప్పటికే వాటాల విక్రయ ప్రక్రియ కోసం అడ్వైజర్‌గా కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీని నియమించుకుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ని నియమించుకునే ప్రక్రియ ప్రారంభించింది. 2017 నవంబర్‌లో పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో సుమారు 6 శాతం వాటాలను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ తదితర ఇన్వెస్టర్లకు పీఎన్‌బీ విక్రయించింది. ఇతరత్రా ఇన్వెస్టర్లలో బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, వాసాచ్, టి రోవి ప్రైస్, సింగపూర్ ప్రభుత్వం, ఫిడిలిటీ, ఇన్‌వెస్కో, రిలయన్స్ ఎంఎఫ్, నొమురా అసెట్ మేనేజ్‌మెంట్ మొదలైన సంస్థలు ఉన్నాయి.
14 శాతం ఎగిసిన షేరు..
వాటాల విక్రయ వార్తలతో సోమవారం పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేర్లు 14% పైగా పెరిగాయి. బీఎస్‌ఈలో 14.19% పెరిగి రూ. 1,223.35 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 13.89% పెరిగి రూ. 1,221.55 వద్ద షేర్లు క్లోజయ్యాయి. ఒక దశలో బీఎస్‌ఈలో 15.73% ఎగసి రూ. 1,239.95 స్థాయిని కూడా తాకాయి. మొత్తం మీద కంపెనీ మార్కెట్ విలువ మరో రూ. 2,637 కోట్ల మేర పెరిగి రూ. 20,484 కోట్లకు చేరింది.
పీఎన్‌బీహెచ్‌ఎఫ్ ఏయూఎం రూ.62వేల కోట్లు
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు పశ్చిమ, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో 84 శాఖలు ఉన్నాయి. వ్యాపారంలో తనఖా ఖాతాల వాటా 70% మేర ఉంటుంది. సంస్థ.. నికర నిరర్ధక ఆస్తుల పరిమాణం 0.25%గాను, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రు. 62,252 కోట్లుగాను ఉంది. 2016లో దాదాపు రూ. 3,000 కోట్ల ఐపీవోకి వచ్చినప్పట్నంచి పీఎన్‌బీ హౌసింగ్ మార్కెట్ విలువ సుమారు రెట్టింపయ్యింది. 2015 ఫిబ్రవరిలో కార్లైల్ రూ.1,600 కోట్లతో 49% వాటా దక్కించుకుంది. ఇటీవలే 5% వాటా విక్రయంతో ప్రస్తుతం పీఎన్‌బీ హెచ్ ఎఫ్‌లో కార్లైల్ వాటా 33%కి పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment