హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.1,425 కోట్లు
క్యూ3లో 12 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గృహ రుణ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ... డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.1,425 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాంలో రూ.1,278 కోట్లతో పోలిస్తే 11.6 శాతం వృద్ధి చెందింది. సంస్థ మొత్తం ఆదాయం 14.13 శాతం ఎగబాకి.. రూ.6,020 కోట్ల నుంచి రూ.6,871 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఆదాయం 12.9 శాతం పెరుగుదలతో రూ.5,985 కోట్ల నుంచి రూ.6,758 కోట్లకు వృద్ధి చెందింది.
కాగా, మొండిబకాయిలు, కంటింజెన్సీల కోసం ఈ క్యూ3లో రూ.45 కోట్లను ప్రొవిజనింగ్ రూపంలో హెచ్‌డీఎఫ్‌సీ కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కేటాయింపులు రూ.25 కోట్లు. 2014, డిసెంబర్ చివరినాటికి సంస్థ ఇచ్చిన మొత్తం రుణాల విలువ రూ.2.19 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది డిసెంబర్ చివరికి ఈ విలువ రూ.1.92 లక్షల కోట్లు. కాగా, డిసెంబర్ క్వార్టర్‌లో తమ అనుంబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 1,19,69,000 ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు వెల్లడించింది. రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరును రూ.105 ధరకు విక్రయించింది.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 2.61 శాతం క్షీణించి రూ.1,310 వద్ద ముగిసింది.