మోటో రాజర్ రిటర్న్స్?
ఐఫోన్ రాకముందు.. అంటే 2004 సంవత్సరంలో ఎవరి చేతిలో చూసిన మోటోరోలా రాజరే ఫ్యాషన్ ఐకాన్ గా ఉండేది. మోటుగా కనిపించే నోకియాలకు భిన్నంగా విప్లవాత్మకమైన డిజైన్ తో ప్రపంచానికి రాజర్ ఫోన్ ను పరిచయం చేసింది మోటోరోలా. ప్రపంచంలోనే అత్యధిక అమ్ముడుపోయిన ఈ ఫోన్, 10 ప్రముఖ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. అయితే ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ లోకంగా మారాక, ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్న రాజర్ ఫోన్ కనుమరుగైంది. మోటోరోలా సైతం స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిసారించడం ప్రారంభించింది. అయితే అప్పట్లో 2.2 అంగుళాలతో చిన్నగా, క్యూట్ గా ఉన్న రాజర్ ఫోన్లు మళ్లీ మార్కెట్లోకి రాబోతున్నాయట.
అమెరికన్ హైస్కూల్ పిల్లలతో "06.09.2016" అనే టైటిల్ తో రూపొందించిన ఓ టీజర్ వీడియోను మోటోరోలా యూట్యూబ్ లో పోస్టు చేసింది. నిన్నటి రాజర్ కాలాన్ని వెనక్కి తీసుకు రాబోతున్నామని, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండడి అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఉంది. వీడియో చివరి అక్షరాలుగా టీటీవైఎల్(టెస్ట్ పార్లెన్స్ ఫర్ టాక్ టూ యూ లేటర్ అంటే టెస్ట్ పరిభాషకోసం మీతో తర్వాత చర్చిస్తాం) అనే సందేశాన్ని ఇచ్చాయి. మోటోరోలా ఈ ఈవెంట్ ను జూన్ 9న చేపట్టబోతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
జూన్ లో ఓ ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎక్స్ ను కంపెనీ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ఫోన్ ఇప్పటివరకూ వచ్చిన రెక్టాగ్యులర్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా కాకుండా.. కొత్తగా ఉండబోతుందని మార్కెట్ వర్గాల టాక్. 2011లో వచ్చిన రాజర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో ఈ ఫోన్ తీసుకురావొచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల వస్తున్న స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ స్క్రీన్ తో, అన్ని యాప్స్ సపోర్టు చేయని విధంగా రాజర్ ఉన్నప్పటికీ, స్మార్ట్ ఫోన్లకు ఎదురవుతున్న ఎదురుదెబ్బలే రాజర్ రిటర్న్ కు మార్కెట్ ను సృష్టించబోతాయని తెలుస్తోంది. ఆ ఫోన్ సరళతే దాని మార్కెట్ కు దోహదంచేస్తుందని టాక్.