
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, నూతన భద్రతా ప్రమాణాల అమలుకు సంబంధించిన ధరల భారాన్ని వినియోగదారులపై మోపాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘జూలై నుంచి కార్ల ధరలను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత కొంతకాలంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతుండడం, భద్రతా ప్రమాణాల అంశాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ధరలు 1.2 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉంది’ అని అన్నారు. పెంపు అమలైతే ఈ ఏడాదిలో రెండవ సారి హోండా కార్ల ధరలు పెరిగినట్లు అవుతుంది. ఫిబ్రవరిలో రూ.10,000 మేర ధరలు పెరిగాయి. మరోవైపు ఇతర సంస్థలు కూడా ఈఏడాది జనవరిలో ధరలను పెంచాయి.