త్వరలో హోండా కార్స్ కొత్త ప్లాంటు
♦ రూ.380 కోట్లతో రాజస్తాన్‌లో నిర్మాణం
♦ 340కి అవుట్‌లెట్స్ పెంపు లక్ష్యం
♦ హోండా సీనియర్ వీపీ జ్ఞానేశ్వర్ సేన్ వెల్లడి
హైదరాబాద్, బిజినె స్ బ్యూరో: దాదాపు రూ. 380 కోట్లతో రాజస్తాన్‌లో నిర్మిస్తున్న కొత్త ప్లాంటు మరో 2-3 నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ కల్లా ఉత్పత్తి ప్రారంభం కాగలదని వివరించారు. ప్రస్తుతం 2.4 లక్షలుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం కొత్త ప్లాంటు రాకతో 3 లక్షలకు పెరుగుతుందన్నారు. అక్టోబర్ నాటికి కొత్తగా అకార్డ్ హైబ్రీడ్ వాహనాన్ని తెస్తున్నామని సేన్ చెప్పారు. ఇక ప్రస్తుతం 298 అవుట్‌లెట్స్ ఉండగా ఈసారి 340కి పెంచుకోనున్నట్లు తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనం బీఆర్-వీని ప్రవేశపెట్టిన సందర్భంగా బుధవారం విలేకరులకు ఆయన ఈ విషయాలు తెలిపారు.
డీజిల్ వాహనాలపై ఆంక్షలు, ఇన్‌ఫ్రా సెస్సు విధింపు తదితర అంశాలతో గత ఆర్థిక సంవత్సరం పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దీనివల్ల తమ అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడిందన్నారు. డీజిల్ వాహనాల మీద ఆంక్షల భయాలతో కస్టమర్లు పెట్రోల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండటంతో తాము కూడా ఆ దిశగా తయారీ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని సేన్ చెప్పారు. గందరగోళానికి తావు లేకుండా సహేతుకమైన, పారదర్శకమైన విధానాలను పరిశ్రమ కోరుకుంటోందన్నారు.
రాష్ట్ర మార్కెట్లోకి హోండా బీఆర్-వీ..: తెలుగు రాష్ట్రాల మార్కెట్లో అమ్మకాలకు సంబంధించి కాంపాక్ట్ ఎస్‌యూవీ బీఆర్-వీని సేన్ ఆవిష్కరించారు. దీని ధర రూ. 8,91,200-రూ.13,13,700 మధ్య ఉంటుంది. మూడు వరుసల సీటింగ్, పెట్రోల్..డీజిల్ వేరియంట్‌ను బట్టి 15.4 కి.మీ.-21.9 కి.మీ. మైలేజీ మొదలైనవి దీని ప్రత్యేకతలు. ఇప్పటిదాకా 4,600 బుకింగ్స్ వచ్చాయని, వీటిలో ఏపీ.. తెలంగాణ నుంచి 300 దాకా ఉన్నాయని సేన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఎస్‌యూవీ విభాగం 35 శాతం వృద్ధి చెందగా, ఎంట్రీ స్థాయి వాహనాల విక్రయాలు 43 శాతం వృద్ధి నమోదు చేసినట్లు సేన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాము సైతం బీఆర్-వీతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించినట్లు వివరించారు.