సాక్షి, ముంబై : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ దారు హ్యుందాయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినతొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోనా ధర భారీగా తగ్గనుంది. ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ తగ్గింపు ప్రతిపాదనతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు విపరీతంగా తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం జీఎస్‌టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన అమలైతే హ్యుందాయ్ కోనా కారు ధర రూ.1.50 లక్షల మేర తగ్గనుంది.
కాలుషాన్ని నివారించేందుకు, ఇంధన వాడకాన్ని నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహానిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న జీఎస్‌టీని తగ్గించే ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలి కోరినట్లు తెలిపిన సంగతి తెలిసిందే.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచింగ్ ధర రూ.25.3(ఎక్స్ షోరూం ధర) ఆర్థికమంత్రి ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే.. కోనా ధర రూ. 23.8 లక్షలుగా ఉండనుంది. అంతేకాదు ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్రం ద్వారా మరో శుభవార్త కూడా ఉంది. ప్రతి కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలు సందర్బంగా వాహనరుణంపై వడ్డీ రాయితీ, ఆదాయపన్ను రాయితీ కలిపి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనాలను అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం రూ.3 లక్షల తగ్గింపుతో కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
కాగా చెన్నైలోని హ్యుందాయ్ ప్లాంట్‌లో అసెంబుల్ అయిన ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్–ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మార్గదర్శకాలతో కూడిన వెనుక కెమెరా ఉన్నాయి. 39.2 కిలో వాట్స్ సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ, 136 బిహెచ్‌పిగరిష్ట పవర్ 395 ఎన్ఎమ్ టార్క్ లాంటివి ఇతర ఫీచర్లు. కేవలం 9.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల హ్యుందాయ్ కోనా ఒక్కసారి ఛార్జింగ్‌తో 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని లాంచింగ్ సమయంలో హ్యుందాయ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment