
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ క్వార్టర్‌లో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి క్వార్టర్‌లో (గత ఆర్థిక సంవత్సరం క్యూ4) రూ.962 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.257 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 815 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. తమ పూర్తి అనుబంధ సంస్థ, మొబైల్ టవర్ల కంపెనీ, ఐడియా సెల్యులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌లో పూర్తి వాటాను రూ.3,365 కోట్లకు ఏటీసీ టెలికమ్‌కు విక్రయించామని, దీంతో ఈ క్యూ1లో నష్టాలు నమోదు చేయకుండా గట్టెక్కామని కంపెనీ వివరించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,758 కోట్ల స్థూల నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని ఐడియా తెలియజేసింది.
54 శాతం తగ్గిన నిర్వహణ లాభం....
అంతకు ముందటి క్వార్టర్‌లో రూ.6,137 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ1లో 4 శాతం తగ్గి రూ.5,889 కోట్లకు చేరిందని ఐడియా తెలిపింది. నిర్వహణ లాభం రూ.1,447 కోట్ల నుంచి 54 శాతం క్షీణించి రూ.659 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నిర్వహణ లాభ మార్జిన్ 23.6 శాతం నుంచి 11.2 శాతానికి పడిపోయింది. అంతకు ముందటి క్వార్టర్‌లో రూ.105గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.100కు తగ్గిపోయింది. సేవల ఆదాయం రూ.8,167 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.5,866 కోట్లకు తగ్గింది. మొబైల్ సర్వీసుల వ్యాపారం రూ.7,943 కోట్ల నుంచి 28 శాతం తగ్గి రూ.5,745 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్‌ఈలో ఐడియా సెల్యులర్ షేర్ 3.6 శాతం లాభంతో రూ.58.45 వద్ద ముగిసింది. గత ఆరు నెలల్లో ఈ షేర్ 40 శాతం పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment