ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా కీలకం
ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ
- విదేశీ పెట్టుబడులు, క్రూడ్ ధరల కదలికలపైనా దృష్టి
- 12న రిటైల్ ద్రవ్యోల్బణం,ఐఐపీ గణాంకాలు...
- స్వల్పకాలానికి తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే అవకాశం...
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ ట్రెండ్‌కు కీలకంగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు(క్రూడ్) ధరల కదలికలపైనా ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారించనున్నారని వారు పేర్కొన్నారు. గురువారం(12న) జనవరి నెలకు ఐఐపీ డేటాతో పాటు ఫిబ్రవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు కూడా వెలువడనున్నాయి. స్టాక్ సూచీల గమనం స్వల్పకాలానికి ఈ రెండు డేటాలపైనే ఆధారపడి ఉంటుందనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. కాగా, సమీప కాలంలో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్‌కు చెందిన వివేక్ గుప్తా అంచనా వేశారు. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.11 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ధరలు అదుపులోనే ఉండటంతో ఆర్‌బీఐ గవర్నర్ రెండు నెలల వ్యవధిలోపే రెండోసారి పావు శాతం పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించి ఆశ్చర్చపరిచారు. దీంతో ఈ రేటు 7.5 శాతానికి దిగొచ్చింది. ఇక ఐఐపీ డిసెంబర్‌లో నామమాత్రంగా 1.7 శాతం వృద్ధి రేటును మాత్రమే నమోదు చేసింది. నవంబర్‌లో ఐఐపీ 3.9 శాతంగా ఉంది.
అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావం...
గురువారం అమెరికాలో వెలువడిన ఫిబ్రవరి నెల ఉద్యోగ గణాంకాల ప్రభావానికి అనుగుణంగా నేడు(సోమవారం) దేశీ స్టాక్ సూచీలు ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. యూఎస్‌లో నిరుద్యోగ రేటు 5.7శాతం 5.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ఫిబ్రవరిలో కొత్తగా అంచనాలకు మించి 2,95,000 కొలువులు జతైనట్లు తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. పటిష్టమైన జాబ్ డేటా నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సమీప భవిష్యత్తులోనే పెంచొచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల పురోగతిని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారని.. బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధాకన్ పేర్కొన్నారు. మార్కెట్లో నెలకొన్న ఆందోళనలు చాలావరకూ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) నిధుల ప్రవాహం కొనసాగనుందని.. ప్రస్తుత వేల్యుయేషన్స్ నిలదొక్కుకోవడానికి అధికంగా ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వారంలో దేశీ మార్కెట్లు బుల్లిష్‌గానే ఉండొచ్చని కూడా అంచనా వేశారు. గడచిన వారంలో సెన్సెక్స్ 88 పాయింట్లు లాభపడి 29,449 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. కాగా, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) మంగళవారం(10న) మార్కెట్లో లిస్ట్ కానుంది.