వృద్ధిపథంలో భారత్: ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి పయనం కొనసాగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. లక్ష్యాలను చేరడానికి మరింత ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధానిగా తన బాధ్యతల సమయం ముగుస్తున్న నేపథ్యంలో మన్మోహన్ బుధవారం ప్రణాళికా సంఘం పూర్తిస్థాయి సభ్యులతో సమావేశం అయ్యారు. సంఘం చైర్మన్‌గా ప్రణాళికా సంఘానికి వీడ్కోలు ప్రసంగం ఇస్తూ, భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. యూపీఏ పదేళ్ల కాలంలో కమిషన్ పనితీరు చాలా బాగుందని అన్నారు. తాజా ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని సైతం సూచించారు.
1991 నుంచి 1996 మధ్యకాలంలో ఆర్థికమంత్రిగా తన పదవీకాలాన్ని కూడా సింగ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా ప్రస్తుత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి తనకు మంచి సహకారం లభించిందని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా మలుపుతిప్పే ఆ కాలంలో ప్రభుత్వం-ప్రణాళికా సంఘం చక్కని సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఇదే రకమైన ధోరణి ఇకముందూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికాభివృద్ధిలో కొత్త ఆలోచనల సృష్టి, మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ సాధన, మౌలిక రంగం ప్రగతికి సంబంధించి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో మంచి ఫలితాలు వంటి అంశాల్లో ప్రణాళికా సంఘం పాత్ర కీలకమని అన్నారు.