విదేశీ ఉద్యోగులకు ఫేవరెట్ దేశాల్లో భారత్‌కు రెండో స్థానం | India Second Most 'Up and Coming' Destination for Expats: HSBC | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగులకు ఫేవరెట్ దేశాల్లో భారత్‌కు రెండో స్థానం

Published Thu, Dec 11 2014 1:47 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

India Second Most 'Up and Coming' Destination for Expats: HSBC

న్యూఢిల్లీ: ఉద్యోగం చేసేందుకు, నివసించేందుకు అనువైనవిగా విదేశీయులు భావిస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానం దక్కించుకుంది. హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన ఈ సర్వేలో చైనా అగ్రస్థానంలో నిల్చింది. సర్వే ప్రకారం సవాళ్లతో కూడుకున్న, సాహసోపేతమైన ప్రాజెక్టులు చేపట్టాలని ఉవ్విళ్లూరే విదేశీ ఉద్యోగులు వర్ధమాన ఆసియా దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఇన్‌ఫ్రా, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి విదేశీ నిధుల సహకారం అవసరమవుతున్నందున, సహజంగానే విదేశీ నిపుణులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్ ఎస్‌బీసీ ఇండియా హెడ్ (రిటైల్ బ్యాంకింగ్ విభాగం) సంజీవ్ సూద్ తెలిపారు.

చైనా, భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న విదేశీ ఉద్యోగుఉల స్థానిక ఎకానమీ వృద్ధిపై సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము ఉంటున్న దేశాలు ఇటు ఉద్యోగపరంగా అటు నివాసించేందుకు మరింత మెరుగ్గా మారుతోందని భావిస్తున్న విదేశీ ఉద్యోగుల సగటు అంతర్జాతీయంగా 32 శాతంగా ఉండగా.. చైనా, ఇండియాలో ఈ సగటు 60 శాతంగా ఉంది. విదేశీ నిపుణులు ఎక్కువగా టెలికం, ఐటీ (21 శాతం), నిర్మాణ, ఇంజినీరింగ్ (19 శాతం), ఆర్థిక సేవలు (10 శాతం) రంగాల్లో ఉన్నారు. ఇక, కంపెనీలు అసైన్‌మెంట్లపై ఉద్యోగులను అధికంగా పంపుతున్న విదేశాల జాబితాలో బ్రెజిల్, టర్కీల తర్వాత భారత్ ఉంది. వర్ధమాన మార్కెట్లకు ప్రాధాన్యం పెరుగుతుండటమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,300 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement