అనుబంధ కంపెనీలు అదుర్స్‌!! | Indian subsidiary companies are the gains carrier | Sakshi
Sakshi News home page

అనుబంధ కంపెనీలు అదుర్స్‌!!

Published Fri, Mar 9 2018 12:11 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

Indian subsidiary companies are the gains carrier - Sakshi

సాక్షి, బిజినెస్‌ విభాగం: ‘ముందొచ్చిన చెవులకన్నా... వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అంటుంటారు. ఇది కొన్ని అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలకు అచ్చంగా సరిపోతుంది. ఎందుకంటే గడిచిన ఐదారేళ్లుగా ఇవి మెల్లగా బండి లాగిస్తుండగా... వాటి భారత అనుబంధ కంపెనీలు మాత్రం లాభాల మోత మోగిస్తున్నాయి. ఆదాయం, నికర లాభాల పరంగా ఇవి మాతృ కంపెనీలనే మించిపోతున్నాయి. హెచ్‌యూఎల్, సుజుకీ, సీమెన్స్, ఏబీబీ, కాల్గేట్‌ పామోలివ్‌... తదితర ఎమ్‌ఎన్‌సీల భారత అనుబంధ కంపెనీలు మంచి జోరుమీదున్నాయి. ప్రధానంగా మారుతీ సుజుకీ, హిందుస్తాన్‌ యూనిలీవర్‌లు మంచి పనితీరు కనబరుస్తున్నాయి.

మారుతీ... ఇదో రికార్డు!
దేశంలో వివిధ బహుళజాతి సంస్థలకు చెందిన దాదాపు 52 కంపెనీలు లిస్టయ్యాయి. వాటి మార్కెట్‌ విలువ గడిచిన ఐదేళ్లలో 120 శాతం పెరిగింది. ఇదే కాలంలో సదరు మాతృసంస్థల మార్కెట్‌ విలువ 10 శాతం మాత్రమే పెరిగింది. 2013 నాటికి ఇక్కడ లిస్టయిన అనుబంధ సంస్థల మార్కెట్‌ విలువ తమ మాతృసంస్థల విలువలో 3.1 శాతమే కాగా... ఐదేళ్లలో ఏకంగా ఐది 6.3 శాతానికి చేరింది. ప్రధానంగా మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్‌ ఈ జోరుకు కారణమని చెప్పాలి. మారుతీ మార్కెట్‌ విలువ మాతృ కంపెనీ జపాన్‌కు చెందిన సుజుకీ కార్పొరేషన్‌ కంటే 50%ఎక్కువ కావటం గమనార్హం. ఇక యూనిలీవర్‌ మొత్తం మార్కెట్‌ విలువలో హెచ్‌యూఎల్‌ మార్కెట్‌ విలువ 28 శాతానికి సమానం. 

అనుబంధ కంపెనీలదే అధికాదాయం
భారత్‌తో సహా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు మంచి జోరుమీదున్నాయి. ఎంఎన్‌సీల భారత అనుబంధ కంపెనీలు కన్సూమర్‌ సెగ్మెంట్లో దాదాపు అగ్రస్థానంలో ఉండటం వల్లే ఇవి ఎక్కువ ర్యాలీ చేశాయని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ధనుంజయ్‌ సిన్హా చెప్పారు. ఐదేళ్ల కిందట... భారత్‌లో లిస్టయిన 47 అనుబంధ కంపెనీల ఆదాయాలు వాటి మాతృ కంపెనీల ఆదాయాల్లో 2 శాతంగా ఉండేవి. ఇప్పుడు ఈ వాటా 2.4 శాతానికి పెరిగింది. లాభాల్లోనూ ఈ వాటా 1.8 నుంచి 2.4 శాతానికి పెరిగింది. 

ఆ సమస్యలు లేకుంటే...!
లేమాన్‌ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి భారత్‌ కంటే అభివృద్ధి చెందిన దేశాలకే అధిక సమయం పట్టింది. ఇది ఎమ్‌ఎన్‌సీల భారత అనుబంధ కంపెనీలకు కలిసొచ్చింది. ప్రస్తుతం అభివృద్ది చెందిన దేశాల్లోని మాతృ కంపెనీల ఆదాయం, నికర లాభం ఒక అంకె వృద్ధిని మాత్రమే చూస్తుండగా... భారత్‌లోని వీటి అనుబంధ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఈ అంతర్జాతీయ కంపెనీల ఆదాయాలు 0.3 శాతం పడిపోగా... అదే సమయంలో వాటి భారత అనుబంధ కంపెనీలు ఆదాయాలు 13 శాతం పెరిగాయి. నికర లాభాలు అక్కడ 4 శాతం తగ్గగా... ఇక్కడ 31 శాతం ఎగిశాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి అడ్డంకులు లేకపోతే ఈ భారత అనుబంధ కంపెనీల జోరు మరింతగా పెరిగేదని నిపుణులంటున్నారు.

కొన్ని అంతర్జాతీయ దిగ్గజాల భారత అనుబంధ కంపెనీలివీ...
►మారుతీ సుజుకీ
►హిందుస్థాన్‌ యూనిలివర్‌
►నెస్లే ఇండియా
​​​​​​​►సీమెన్స్‌ ఇండియా
​​​​​​​►ఏబీబీ ఇండియా
​​​​​​​►అబాట్‌ ఇండియా
​​​​​​​►కమిన్స్‌ ఇండియా
​​​​​​​►అక్జో నోబుల్‌ ఇండియా
​​​​​​​►వర్ల్‌పూల్‌ ఇండియా
​​​​​​​►జిల్లెట్‌ ఇండియా
​​​​​​​►పీ అండ్‌ జీ హైజిన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌
​​​​​​​►గ్లాక్సో స్మిత్‌లైన్‌ ఫార్మా
​​​​​​​►గ్లాక్సో స్మిత్‌లైన్‌ కన్సూమర్‌ హెల్త్‌కేర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement